సీమ జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

  • Published By: chvmurthy ,Published On : March 24, 2019 / 04:28 AM IST
సీమ జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

Updated On : March 24, 2019 / 4:28 AM IST

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం, మార్చి24న కడప జిల్లా బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం ఆయన 10.30 గంటలకు  కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 10.55 గంటలకు బద్వేలులోని బిజివేముల వీరారెడ్డి కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు.

అనంతరం అక్కడి నుంచి 11.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి  మధ్యాహ్నం 12.15 గంటలకు రాయచోటిలోని జూనియర్‌ కళాశాల వద్దకు చేరుకుంటారు. అక్కడ గంట పాటు జరిగే ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ ఒంటి గంట వరకు బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి 1.05 గంటలకు హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లాలో ప్రచారానికి బయలుదేరుతారని పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా పలమనేరులో మధ్యాహ్నం 1.45 గంటలకు క్లాక్‌ టవర్‌ సెంటరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  సీఎం ప్రసంగిస్తారు. హంద్రీ-నీవా నీటిని పలమనేరుతోపాటు కుప్పం తరలించిన విషయాన్ని చంద్రబాబు ఈ బహిరంగ సభలో ప్రజలకు వివరించే అవకాశం ఉంది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాళహస్తికి చేరుకుంటారు. స్థానిక బరేవాడి కల్యాణమండపం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన  మాట్లాడతారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయాన్ని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాలను ఇక్కడి ఓటర్లకు వివరించనున్నారు.  శ్రీకాళహస్తి సభ ముగిసిన తర్వాత చంద్రగిరికి చేరుకుని సాయంత్రం 5 గంటలకు క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో మట్లాడతారు. చంద్రగిరి అనంతరం .. సాయంత్రం 6.15 గంటల నుంచి తిరుపతి లీలామహల్‌ సెంటర్ నుంచి అంబేద్కర్‌నగర్, సత్యనారాయణపురం సెంటర్ వరకు రోడ్‌షో నిర్వహించి అక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.