చంద్రబాబు చిన్ననాటి స్నేహితుడు: నంది అవార్డు గ్రహీత శివప్రసాద్

  • Published By: vamsi ,Published On : September 21, 2019 / 09:26 AM IST
చంద్రబాబు చిన్ననాటి స్నేహితుడు: నంది అవార్డు గ్రహీత శివప్రసాద్

Updated On : September 21, 2019 / 9:26 AM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. మూత్ర పిండాల్లో సమస్య కారణంగా శివప్రసాద్ ఆరోగ్యం విషమించగా ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. 11 జూలై 1951న జన్మించిన నారమల్లి శివప్రసాద్ తల్లిదండ్రులు నాగయ్య, చెంగమ్మ. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు శివప్రసాద్. ఫిబ్రవరి 26, 1972న రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్న శివప్రసాద్ కు ఇద్దరు కుమార్తెలు. సాహిత్యము, కళలు, సినిమా నటన అంటే శివప్రసాద్ కు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పలు సినిమాల్లో ఆయన నటించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు శివప్రసాద్ కు చిరకాల అనుబంధం ఉంది. శివప్రసాద్, చంద్రబాబు చిన్ననాటి నుంచి స్నేహితులు. తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన శివప్రసాద్ నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఎన్నో సినిమాల్లో నటించారు. 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో నటనకు శివప్రసాద్ కు నంది అవార్డు కూడా లభించింది.

శివప్రసాద్ మృతిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన చంద్రబాబు.. శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు అని చంద్రబాబు అన్నారు.