చెర్వుగట్టు జాతర : 108 శివ లింగం ఇదే

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 02:19 PM IST
చెర్వుగట్టు జాతర : 108 శివ లింగం ఇదే

నల్గొండ : తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది నల్గొండ జిల్లాలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నుంచి నీరాజనాలందుకుంటోంది. లోకకల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి. మహిమాన్విత క్షేత్రంగా వర్థిల్లుతున్న ఈ ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన నేపథ్యంలో 10tv ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని చెర్వుగట్టు గ్రామంలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వెలసింది. వాస్తవానికి ఈ చెర్వుగట్టు గతంలో ఎల్లారెడ్డిగూడెం గ్రామ అవాస ప్రాంతంగా ఉండేది. దీనికి తూర్పున చెరువు, దాని గట్టున పార్వతీ
సమేత మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది. ఆ ఆలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వెలసింది. ఇది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఈ ప్రాంతం చెరువు గట్టున ఉండటంతో చెర్వుగట్టుగా అవతరించింది. ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం, ఈ లింగాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని ప్రజలు నమ్ముతుండటంతోపాటు… కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో… పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది. యుగాల నాటి చరిత్ర ఉన్న ఈ దేవాలయం… అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో శివలింగాలను ప్రతిష్టించగా… అందులో ఈ ఆలయంలోని శివలింగమే ఆఖరిది. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.

ఈ ప్రదేశంలో ఎంతోకాలం తపస్సుచేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు… తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై పరుశువుతో ఒక దెబ్బ వేశాడని.. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం చెబుతోంది. అయితే పరశురాముడు పరుశువుతో కొట్టిన సమయంలోనే శివలింగం వెనకభాగంలో జడలుగా లింగాకారం ఏర్పడిందని.. అందుకే జడల రామలింగేశ్వరాలయంగా ప్రసిద్ధి కెక్కిందని ఇక్కడి ఆలయ పూజారులు చెబుతున్నారు. 
ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలున్నాయి. కొండపై భాగాన మూడు గుండ్లుగా పిలవబడే రాతి బండలపై కొలువైన మరొక శివలింగం కూడా ఉంది. మూడుగుండ్లు ఎక్కితే కడగండ్లు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే… గుండ్లపై ఉన్న స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకుని క్షీరాభిషేకం చేస్తారు.

రెండు బండల మధ్యన ఉన్న చిన్నపాటి సందులోనుంచి భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. కల్మషం లేకుండా శివనామాన్ని జపిస్తూ వెళ్తే భారీకాయులు సైతం ఆ బండల మధ్య నుంచి బయటికి వస్తారని… దుర్బుద్ధితో వచ్చేవారు అందులోనే ఇరుక్కు పోతారని భక్తులు చెబుతారు. అయితే… అయితే కాలక్రమంలో భక్తుల విజ్ణప్తి మేరకు ప్రత్యామ్నాయంగా ఇనుప మెట్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో వెలసిన స్వామివారి పాదాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడి పాదుకలను తలపై పెట్టుకొని.. స్వామివారి పాదాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తే ఎంతటి అనారోగ్యమైనా ఇట్టే మాయమవుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్య ముందు చతుర్ధశి రోజున రుద్రహోమం చేయడం అనవాయితీ. అమావాస్య రోజున స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహిస్తారు. అందుకే అమవాస్య రోజున ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే సర్వపాపాల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.