తల్లి ఒడికి : చిన్నారిని అప్పగించిన పోలీసులు

తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి వీరేశ్ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మహారాష్ట్ర నుంచి బాబుని తీసుకొచ్చిన తిరుపతి పోలీసులు వైద్య పరీక్షల అనంతరం పేరెంట్స్‌కు అప్పగించారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగిరావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. వెంకన్న దయవల్లే బిడ్డ తిరిగి తమ చెంతకు చేరాడని అన్నారు. ఈ 48 గంటలూ క్షణమొక యుగంలా గడిపామన్నారు.
కిడ్నాప్‌కి కారణం:
మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ జాదవ్ దంపతులు తమ 16 నెలల పిల్లాడు వీరేశ్ జాదవ్‌తో కలిసి 2018, డిసెంబర్ 27 గురువారం తిరుమలకు వచ్చారు. అద్దె గది దొరక్కపోవడంతో యాత్రి సదన్-2 ముందున్న మండపంలో నిద్రించారు. తెల్లారి లేచి చూస్తే వీరేశ్ కనిపించలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. బాబు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. 48గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత పోలీసులు కిడ్నాపర్‌ను మహారాష్ట్ర నాందేడ్‌లో గుర్తించారు. కిడ్నాపర్ విశ్వంబర్‌ది నిజామాబాద్ జిల్లా శాస్త్రినగర్. మేస్త్రీగా పని చేస్తాడు. బాబుని పెంచుకునేందుకు కిడ్నాప్ చేశానని అతడు విచారణలో అంగీకరించాడు. గతంలో పలు చోరీలకు పాల్పడ్డాడు. తరుచుగా తిరుమల వెళ్లి దొంగతనాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ ఘటనపై మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. మహారాష్ట్ర మహోర్‌లోని రేణుకాదేవి ఆలయం కోనేరు వద్ద చంటిబిడ్డతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కిడ్నాపర్‌ని స్థానికులు విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.