కరోనా దెబ్బకు నెల్లూరులో సినిమాహాల్స్, స్కూల్స్ బంద్, జనం బేజారు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్ ను తాకింది. నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో జనం భయపడిపోతున్నారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్ అని పూణే లోని వైరాలజీ ల్యాబ్ నిర్ధారించింది.
మొదట తిరుపతి స్విమ్స్‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్ అని గుర్తించారు. తుది నివేదిక కోసం ఆ శాంపిల్స్‌ను పుణెలోని ల్యాబ్‌కు పంపగా.. గురువారం అందిన నివేదికలోనూ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ప్రకటించారు. దీంతో నెల్లూరు జిల్లా అంతా హెల్త్ అలెర్ట్ ప్రకటించారు.
ఈ వార్తతో రాష్ట్రం అంతా ఒక్కసారిగా అలజడి చెలరేగింది. నెల్లూరు జిల్లాలో ప్రజలైతే హడలి పోతున్నారు. నెల్లూరులోని చిన్నబజారులో నివాసం ఉండే కరోనా సోకిన వ్యక్తి ఉంటున్న ఇంటికి ఇరువైపులా ఉన్నవారు ఇళ్ళు ఖాళీచేసి వేరే ప్రాంతాలకు వెళ్లి పోయారు. వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు.
చిన్న బజారుకు వెళ్లాలంటే ప్రజలు హడలిపోతున్నారు. నెల్లూరులోని సినిమా థియేటర్లు, హోటళ్ల యజమానులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కొన్ని రోజుల పాటు సినిమా హాళ్ళు మూసి వేయమని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
నెల్లూరు నగరంలో 50 ప్రత్యేకవైద్య బృందాలు 20 వేల ఇళ్లను సర్వే చేస్తున్నాయని రోగ లక్షణాలు ఉన్నవారికి వైద్య సహయం చేస్తున్నారని కలెక్టర్ శేషగిరి బాబు చెప్పారు. జనసంచారం ఎక్కువగా ఉండే బస్టాండ్, రైల్వేస్టేషన్ల లోనూ ప్రత్యేక శానిటేషన్ చేయిస్తున్నామని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలు, మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు ప్రకారం అధిక జనసంచారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు.
షాపింగ్‌మాల్స్‌లో కూడా ప్రజలు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. నగరంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు లిక్విడ్ క్లోరిన్‌ను స్ర్పే చేశారు. మరో 14 మంది కరోనా అనుమానితులకు జీజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డులో పరిశీలనలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కొన్నాళ్ల పాటు షాపింగ్ మాల్స్ కూడా మూసి వేయించే ఉద్దేశ్యంతో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది,కాకపోతే వ్యాపార వర్గాలు గగ్గోలు పెడతాయనే ఉద్దేశంతో ఆ దిశగా ఆదేశాలివ్వడానికిఅధికారులు జంకుతున్నారు. ఓ అంతర్జాతీయ సెమినార్ కోసం నెల్లూరు వచ్చిన విదేశీ బృందాన్ని వైద్యఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది. వీరు ఏ హోటల్ లో బస చేశారనే విషయం కూడా బైటకు రానీయకుండా అధికారులు అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నారు.
కరోనా వైరస్ గురించి ఏదైనా ప్రకటన చెయ్యాలంటే అధికారులు జంకుతున్నారు. ఓవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు, మరోవైపు నామినేషన్ల పర్వం సాగుతుండటంతో ఎలాంటి ప్రకటన చేయాలన్నా అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
See Also | టీడీపీకి రాజీనామా చేసి..వైసీపీలో చేరిన మైనర్టీ నేత : కేఈ సోదరులదీ అదే దారా