నో కాంప్రమైజ్..అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ

అక్రమ కట్టడాలపై జగన్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా కృష్ణా నది కరకట్టపై నిర్మించిన నిర్మాణాలపై సీరియస్‌గా ఉంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా స్పందించని వారిపై కొరఢా ఝులిపిస్తోంది. ఏడు రోజుల సమయం ఇచ్చినా..తొలగించకపోతుండడంతో సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం CRDA అధికారులు..సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. నిర్మాణాలను తొలగిస్తున్నారు.
అందులో భాగంగా పాతూరి కోటేశ్వరరావుకు చెందిన గెస్ట్ హౌస్ ర్యాంప్‌ను సిబ్బందితో తొలగించారు. నదీ ప్రవాహాన్ని అడ్డుకుని కరకట్టపై నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. కరకట్టపై ఉన్న 29 వాటికి నోటీసులు ఇవ్వడం జరిగిందని, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కూల్చివేతకు ముందు తాము 7 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుందని, ఈ సమయంలో నిర్మాణాలకు సంబంధించిన సరియైన పత్రాలను తమకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు అధికారులు. అనంతరం వాటిని పరిశీలిస్తామన్నారు. రిటర్నింగ్ వాల్ కాదని..నదీ గర్భంలో ఏడు మీటర్ల లోపుకు వెళ్లి కట్టడం చేయడంతో కూల్చివేస్తున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అక్రమ కట్టడంలో ఉంటూ..ఖాళీ చేయకుండా..మొండిగా ఉంటున్న బాబు..ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స. ఖాళీ చేయకతప్పదన్నారు. ఒకవేళ వారు తొలగించకపోతే..ప్రభుత్వమే కూల్చివేస్తుందని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స. మరి..బాబు నివాసంలోని ప్రభుత్వం చెబుతున్నట్లు..అక్రమ కట్టడాలను వారు తొలగిస్తారా లేక ప్రభుత్వమే కూల్చివేస్తుందా అనేది చూడాలి.