అలర్ట్ : మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దు

నిజాంసాగర్ పరిధిలోని ప్రజలకు ముఖ్య గమనిక. మిషన్ భగీరథ నీళ్లు అప్పుడే తాగొద్దు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. పైపుల లీకేజీతో మిషన్ భగీరథ జలాలు కలుషితమవుతున్నాయని, ఆ నీళ్లు తాగొద్దని కలెక్టర్ సూచించారు. కామారెడ్డి జిల్లాలో అతిసారం ప్రబలిన గాలిపూర్, మగ్దుంపూర్, కోమలంచ గ్రామాలను బుధవారం(మార్చి 28, 2019) కలెక్టర్ సందర్శించారు. 100 మందికి డయేరియా సోకిందని వైద్యాధికారులు కలెక్టర్‌కు తెలిపారు. నీరు కలుషితం కావడం వల్లే జరిగిందన్నారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్.. భగీరథ నీటిని ట్యాంకుల్లోకి ఎక్కించొద్దని ఆదేశించారు.
ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం చేపట్టింది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్ట్ పూర్తి చేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 3 రోజుల(మార్చి 25, 2019) క్రితమే నీళ్లు వచ్చాయ్. ప్రధాన పైపులైన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. నల్లా కనెక్షన్ల ద్వారా మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గువ్వలదిన్నె తదితర గ్రామాల్లో తాగునీరు చేరింది. కేటీదొడ్డి మండలంలోని తండాల్లో పనులు పూర్తికావడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో తాగునీరు ఇచ్చి తీరుతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేసవికాలంలో ప్రతి ఏటా తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు.. గ్రామశివారులోని పొలాల నుంచి తాగునీరు తెచ్చుకునేవారు. మిషన్ భగీరథ నీరు రావడంతో నీటికోసం పొలాల్లో బోరుబావులను ఆశ్రయించాల్సిన పనితప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.