బోటు ప్రమాదం : తమ వారి ఆచూకీ తెలియక కుటుంబసభ్యుల్లో ఆందోళన

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరిలో బోల్తా పడిన రాయల్ వశిష్ఠ లాంచీలో సామర్థ్యానికి మించిన పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించి ఎక్కించారని తెలుస్తోంది. 72 మందితో గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండల వైపు ప్రయాణమైన రాయల్ వశిష్ఠ లాంచీ.. తన గమ్యానికి చేరుకోలేకపోయింది. కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైంది. బోటు నుంచి 24 మంది సురక్షితంగా కచ్చులూరు సమీపంలో ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. 38 మంది గల్లంతైనట్లు నిర్ధారించిన అధికారులు వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందాలు రానున్నాయి. ఏవైనా మృతదేహాలు బురదలో కూరుకు పోయినట్టయితే వాటిని కనుగునే అవకాశం ఉంది. సైడ్ స్కాన్ సోనార్‌తో గాలింపు చర్యలు చేపట్టనున్నారు. గోదావరి నది ఆటుపోట్ల గురించి క్షుణ్ణంగా తెలిసిన స్థానిక మత్స్యకారుల సహకారాన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీసుకుంటున్నాయ. గల్లంతైన వారిలో చివరి వ్యక్తి దొరికేంత వరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామని చెబుతున్నారు. మరోవైపు.. ఏ నిమిషంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన.. గల్లంతైన వారి కుటుంబీకుల్లో కనిపిస్తోంది.
రాయల్ వశిష్ట బోటు ప్రమాదంలో సహయచర్యలకు వరద ఆటంకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో… గాలింపు చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. మొదట రెండు హెలికాప్టర్లతో పాటు ప్రత్యేక బృందాల ద్వార గాలింపు చర్యలు చేపట్టినప్పటికి రాత్రి ఎనిమిది గంటల వరకు 10 మృత దేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు.
గల్లంతైనవారిని ఆచూకీ కోసం ఆదివారం రాత్రి సమయంలో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రమాదానికి గురైన వారు మృతి చెందినట్టయితే మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోకుండా రాజమండ్రి బ్రిడ్జి వద్ద వలలు ఏర్పాటు చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్.. ఎస్డీఆర్ఎఫ్.. ఫైర్ ఫైటర్స్, నేవీ గజ ఈతగాళ్ల బృందాలు పాల్గొంటున్నాయి. ఫ్లడ్ లైట్లు, స్పాట్ లైట్లు, లైఫ్ జాకెట్లు, హెడ్ లైట్ హెల్మెట్లు, రెండు హెలికాఫ్టర్లు, 8బోట్లు, ఆస్కా లైట్లతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Read More : బోటు ప్రమాదం : దేవీపట్నం వెళ్లనున్న సీఎం జగన్