మరో వివాదంలో చింతమనేని: హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇబ్బందులపై టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా పోలీసులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని గృహ నిర్భందం చేశారు. ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. టీడీపీ నేతల ముందస్తు అరెస్టుల్లో భాగంగా.. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడిని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
గుంటూరులో శుక్రవారం (ఆగస్టు 30) ఉదయం నుంచి టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. గుంటూరులోని లాడ్జి సెంటర్ లో ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూనగర్ లో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జి నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఇదిలా ఉండగా.. చింతమనేని మరో వివాదంలో చిక్కుకున్నారు. పినకడిమి శివారులో ఎడ్లబళ్లపై ఇసుక తీసుకువెళుతున్న దళితులను అడ్డుకుని..వారిని కులం పేరుతో దూషించారని దళితులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దళితు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మద్దతునిచ్చారు. చింతమనేనిపై దళితులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టటంతో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.