3 రాజధానులు చేస్తే రాష్ట్రం శ్మశానమే అవుతుంది – జేసీ దివాకర రెడ్డి

  • Published By: chvmurthy ,Published On : January 16, 2020 / 09:33 AM IST
3 రాజధానులు చేస్తే రాష్ట్రం శ్మశానమే అవుతుంది – జేసీ దివాకర రెడ్డి

Updated On : January 16, 2020 / 9:33 AM IST

ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో  చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క  డీల్ లో  జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుతున్నారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా అమరావతి ఫ్రాంతంలోని మందడం గ్రామంలో రైతులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన ఈరోజు సందర్శించారు.

ఈసందర్భంగా దివాకర రెడ్డి మాట్లాడుతూ.. మూడు రాజధానులు చేసేయ్ అని కేసీఆర్ జగనుకు చెప్పారట. అందుకే  జగన్ 3 రాజధానులు ప్రకటించాడు. దీంతో ఏపీలోని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని అన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఏపీపై నమ్మకం.. విశ్వాసం పోయిందన్నారు. ఓ ఏడాది…ఏడాదిన్నరలో భారతి ముఖ్యమంత్రి కావచ్చని మరోసారి  జేసీ చెప్పారు.  కుల ద్వేషం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని…సీఎం అవూతూనే రాజధాని మార్చాలని జగన్ అనుకున్నాడని చెప్పారు.  

కృష్ణా-గోదావరి నదుల వల్లే ఈ ప్రాంతంలో డబ్బు ఎక్కువగా ఉందని…మెజార్టీ వ్యక్తులు ఈ ప్రాంతంలో భూములు కొని ఉండొచ్చేమో కానీ..కేవలం కమ్మ వాళ్లే భూములు కొనలేదని చెప్పారు.  ఒక కులంపై, వ్యక్తిపై ద్వేషంతో ఇలా చేయడం సరికాదుని ఆయన  హితవు పలికారు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొన్నారని, ఏడు నెలలుగా విజయసాయిరెడ్డి విశాఖలోనే తిష్టవేశాడని దివాకర రెడ్డి అన్నారు.  

మంత్రి బొత్స రాజధాని శ్మశానం అని అన్నాడని, నిజంగా మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానమే అవుతుందని  దివాకర రెడ్డి చెప్పారు. మనిషికి తల ఎంత ముఖ్యమో రాజధానికి సెక్రటేరియాట్, అసెంబ్లీ అంతే ముఖ్యమని జేసీ చెప్పారు. జగన్ ఉద్దేశంలో ప్రజలు గొర్రెలని… ప్రజలు గొర్రెలు కాకపోతే 151 సీట్లు ఎలా ఇస్తారని  జేసీ వ్యాఖ్యానించారు.   జగన్ వల్ల తనకు చెడ్డపేరు వస్తుందని.. బెంగళూరు పంపిస్తానని  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో  తనతో  అనేవారని దివాకర రెడ్డి చెప్పారు. దున్నపోతుపై వర్షం పడినట్లు  జగన్ వ్యవహార శైలి ఉందని ఆయన అన్నారు.