అడుగంటిన శ్రీశైలం జలాశయం 

శ్రీశైలం జలాశయం వేసవికి ముందే అడుగంటింది.

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 05:57 AM IST
అడుగంటిన శ్రీశైలం జలాశయం 

Updated On : February 5, 2019 / 5:57 AM IST

శ్రీశైలం జలాశయం వేసవికి ముందే అడుగంటింది.

కర్నూలు : శ్రీశైలం జలాశయం వేసవికి ముందే అడుగంటింది. గత ఏడాది జనవరి 31 నాటికి డ్యాం నీటిమట్టం 877.20 అడుగులు ఉండగా జలాశయంలో నీటినిల్వ 174 టీఎంసీలుగా నమోదైంది. ప్రసుత్తం డ్యాం నీటిమట్టం 842.10అడుగులు ఉండగా నీటినిల్వ 65.10 టీఎంసీలు మాత్రమే ఉంది. డ్యాం కనీస నీటి మట్టం 834 అడుగులు. గత ఏడాది ఇదే సమయానికన్నా ప్రస్తుతం 35.10 అడుగుల మేర నీటిమట్టం, 108.90 టీఎంసీల మేర నీటి నిల్వ తక్కువగా నమోదవుతోంది. వేసవికి మరో నెలరోజులుండగానే జలాశయంలో నీటినిల్వ తగ్గిపోవడం కర్నూలు, కడప జిల్లాల రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

 
విభజన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2014 అక్టోబర్‌ 21నే కుడిగట్టులో విద్యుదుత్పత్తిని నిలిపివేసింది. ఇలా చేయడం ద్వారా కడప, కర్నూలు జిల్లాలకు నీరందించే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలకు అనువుగా ఉంటుందని అధికారులు భావించారు. అయితే, తెలంగాణ సర్కార్‌ ఆధ్వర్యంలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు డిమాండ్‌ కారణంగా విద్యుదుత్పత్తిని కొనసాగించారు. దీంతో డ్యాం నీటిమట్టం ఈ ఏడాది వేసవికి ముందే కనిష్ఠ స్థాయికి చేరింది. 

శ్రీశైలం డ్యాం కింద ఆంధ్రప్రదేశ్‌ ఆయకట్టే అధికంగా ఉండటంతో దీన్ని దృష్టిలో ఉంచుకుని కుడిగట్టున మూడు నెలలుగా విద్యుదుత్పత్తి నిలిపివేశారు. అయినా తాగు, సాగునీటి కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు వేసవిలో విద్యుదుత్పత్తి కూడా కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. నాలుగురోజుల క్రితమే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల నిలిచిపోవడం రైతులను కలవరపెడుతోంది. ఓవైపు జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ కారణంగా ఎడమగట్టులో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. డ్యాం కనీస నీటిమట్టాన్ని 834 అడుగులుగా పేర్కొనడంతో మరో 8.10 అడుగుల నీటిని మాత్రమే విద్యుదుత్పత్తికి వినియోగించుకునేందుకు వీలుంది. ప్రస్తుతం డ్యాంలో ఉన్న నీటిని పరిశీలిస్తే వేసవికి ముందే విద్యుదుత్పత్తి కూడా నిలిచిపోయే అవకాశముంది.