జనసేన లాంగ్‌మార్చ్‌కు గంటా శ్రీనివాసరావు

  • Published By: vamsi ,Published On : November 2, 2019 / 10:22 AM IST
జనసేన లాంగ్‌మార్చ్‌కు గంటా శ్రీనివాసరావు

Updated On : November 2, 2019 / 10:22 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌కు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే లాంగ్ మార్చ్‌లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా విశాఖ జిల్లాలో బలమైన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు కూడా ఇసుక కొరతపై విశాఖ ర్యాలీలో పాల్గొననున్నారు.

ఈ మేరకు లాంగ్‌మార్చ్‌లో పాల్గొనాలని ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు మాజీ మంత్రులకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.  రేపు అనగా నవంబర్ 3వ తేదీ ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమం జరగనుంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మద్దతు కోరారు.

దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ లాంగ్ మార్చ్‌కు మద్దతు ఇవ్వాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలు పంపారు. ఇదిలా ఉంటే వామపక్షాలు మాత్రం బీజేపీ మద్దతు పవన్ కళ్యాణ్ కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్దతు ఇవ్వట్లేదని పవన్ కళ్యాణ్‌కు వెల్లడించారు.