వారికి కోరుకున్న చోటు ఇళ్లు : సీఎం జగన్ ఆదేశాలు

  • Published By: madhu ,Published On : September 28, 2019 / 03:30 AM IST
వారికి కోరుకున్న చోటు ఇళ్లు : సీఎం జగన్ ఆదేశాలు

Updated On : September 28, 2019 / 3:30 AM IST

కృష్ణా నది కట్టపైన, కరకట్ట లోపల, కాల్వ గట్లపై నివాసం ఉంటున్న వారికి గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. వారు కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడిస్తున్న సెంటున్నర కాకుండా..కనీసం రెండు సెంట్ల విస్తీరణంలో వీరందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ 28వ తేదీ శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బోత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు..వీటి కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలే కారణమన్న జగన్..చిన్నపాటి వర్షానికే పలు నగరాలు నరకయాతన పడుతున్నాయని..అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నారు.

ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకోని సుదీర్ఘకాలంగా ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని, ఉగాది నాటికి పేదలకు పట్టాలు ఇవ్వడమే కాకుండా..మంచి డిజైన్లలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదని, వీటి విషయంలో వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు, డ్రైనేజీ, ఇళ్లు, విద్యుత్, రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ లాంటివి సమకూర్చే బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలదేనని స్పష్టం చేశారు సీఎం జగన్.