అమరావతి కోసం రైతుల భారీ ర్యాలీ

  • Published By: vamsi ,Published On : January 29, 2020 / 11:07 PM IST
అమరావతి కోసం రైతుల భారీ ర్యాలీ

Updated On : January 29, 2020 / 11:07 PM IST

మహాగ్ని గుండమై మందడం మండుతోంది.. తల్లడిల్లిన తుళ్ళూరు తిరగబడి చెండుతోంది.. దండయాత్రకు అండగా.. దొండపాడు కదిలింది. పెనుమాక పోలికేకతో పెనునిద్దుర వదిలింది.. నిడమర్రు, నెక్కల్లు నిగ్గదీసి అడుగుతున్నాయి. అనంతవరం ఐనవోలు.. నీరుకొండ.. వెలగపూడి.. బోరుపాలెం.. ఎర్రబాలెం.. ఉద్దండరాయునిపాలెం.. శాఖమూరు.. రాయపూడి.. వెంకటపాలెం.. ప్రతి ఊరిలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకు వచ్చారు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. 43రోజులుగా తమ గోడు వెళ్లబోసుకుంటూ నిరసనలు తెలుపుతున్న రైతులు.. అమరావతి జేఏసీ పిలుపు మేరకు తుళ్లూరు నుంచి మందడం వరకు చేపట్టిన భారీ వాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు వచ్చారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లతో వేలాదిగా జనం ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.

రాజధాని పరిధిలోని 29 గ్రామాల మీదుగా ప్రదర్శన కొనసాగింది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదు లింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా ప్రదర్శన తిరిగి తుళ్లూరు చేరుకుంది.  ‘జై అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అంటూ నినాదాలు చేశారు.

జేఏసీ నిర్వహించిన ర్యాలీ వీడీయోని తెలుగుదేశం పార్టీ తన అధికార ట్విట్టర్ పేజ్ ద్వారా పంచుకుంది. రాజధాని రైతుల బైక్ ర్యాలీపై ట్వీట్ చేసిన ఆ పార్టీ.. ‘‘కళ్లు మూసుకుపోయి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్న పాలకపక్ష నేతలు ప్రజల ఆకాంక్షలను నిర్దాక్షిణ్యంగా అణిచేయడానికి మతి లేని మాటలేవో మాట్లాడుతున్నారు. ప్రజలు పోరాటం చేస్తుంటే కృత్రిమ ఉద్యమమంటూ కారుకూతలు కూస్తున్న వైసీపీ నేతలూ చెప్పండి.. దండులా కదిలిన ఈ వాహన శ్రేణి కృత్రిమమా?’’ అంటూ కామెంట్ చేసింది. 

నారా లోకేష్ కూడా వీడియోని ట్వీట్ చేసి, రాజధాని రైతుల మహా ప్రదర్శన చూసైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కళ్లు తెరవాలని కోరారు.