అమ్మకానికి 200మంది ఆంధ్ర అమ్మాయిలు

  • Published By: vamsi ,Published On : January 25, 2020 / 05:36 AM IST
అమ్మకానికి 200మంది ఆంధ్ర అమ్మాయిలు

Updated On : January 25, 2020 / 5:36 AM IST

సోషల్ మీడియాలో ప్రత్యర్ధులపై తన ట్వీట్లతో విరుచుకుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి.. లేటెస్ట్‌గా ఓ సంచలన ట్వీట్ చేశారు. కువైట్ లో 200మంది ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లుగా మహిళలు చెబుతున్న వీడియోను పోస్టు చేసిన విజయసాయి రెడ్డి, కువైట్ లో చిక్కుకున్న ఏపీ అమ్మాయిల్ని రక్షించాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌ని కోరుతూ ట్వీట్ చేశారు. 

హ్యూమన్ ట్రాఫికింగ్‌లో భాగంగా మోసపోయిన 200 మంది ఏపీ అమ్మాయిలు కువైట్‌లో నరకం చూస్తున్నట్లుగా ట్వీట్‌లో విజయసాయి రెడ్డి వెల్లడించారు. కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ వద్ద చిక్కుకుపోయారని.. వారిని కాపాడాలని ఆయన ట్విట్టర్ ద్వీరా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. వారిని తిరిగి దేశానికి వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. విజయసాయి పోస్టు చేసిన వీడియోలో బాధిత మహిళలు చెప్పిన దాని ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడి యువతులకు మాయ మాటలు చెప్పి కువైట్ పంపించారు.

అతడి మాటల్ని నమ్మి కువైట్ వెళ్లిన మహిళలను సారా అనే మహిళ రిసీవ్ చేసుకొని.. వారిని అమ్మేస్తుందని వీడియోలో వెల్లడించారు మహిళలు. ఇలా మోసపోయిన వారు నానా కష్టాలు పడి ఇండియన్ ఎంబసీ వద్దకు చేరుకొని.. వేరే వారి ఫోన్ నుంచి వీడియో రికార్డు చేసి విడుదల చెయ్యగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ ఆరోగ్యం బాగోలేదని.. తమను ఆదుకోవాలని వారు ఏపీ సీఎం జగన్‌ను వీడియోల కోరారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో వీడియోని పోస్టు చేశారు.