హుజూర్ నగర్ కారు జోరు : 9వ రౌండుకి 19వేల ఆధిక్యం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం వైపు హుజూర్ నగర్ నియోజకవర్గ ఓటర్లు నిలుస్తున్నారు. రౌండ్ రౌండ్‌కు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి దూసుకపోతున్నారు. 9వ రౌండ్ ముగిసే సరికి 19 వేల 200 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి దూసుకెళుతుండగా..కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి 20 వేల 754 ఓట్లను సాధించారు. కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసే పరిస్థితి కనిపిస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ, టీడీపీ పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి.
కనీస ఓట్లు సాధించలేని పరిస్థితి నెలకొంది. తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డి గట్టిపోటీనివ్వలేదు. ఆర్టీసీ సమ్మె ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అనుకున్నా..అలాంటిదేమి కనిపించలేదు. 40 వేల మెజార్టీ సాధిస్తామని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి వెల్లడిస్తున్నారు. సిట్టింగ్ స్థానం అయిన..కాంగ్రెస్ ఈ సీటును కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఈ పార్టీ నేతలు నిరాశలో మునిగిపోయారు. మొత్తానికి హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ ఖాయమని అందరూ భావించారు. కానీ ఓటర్లు అధికార పార్టీ వైపే మొగ్గు చూపారు.
302 పోలింగ్ కేంద్రాల్లో 2 లక్షల 36వేల 842 మంది ఓటర్లకు గాను రెండు లక్షల 754 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు.. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.