ప్రధానికి అమరావతి రైతుల లేఖలు : మూడు రాజధాలను విషయంలో జోక్యం చేసుకోండి

మూడు రాజధాలను విషయంలో జోక్యం చేసుకోండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి రైతులు లేఖలు రాశారు. తమ ఆధార్ కార్డు జిరాక్స్ లను లేఖలకు జత చేస్తూ రైతులు పెద్ద సంఖ్యలో ప్రధాని మోడీకి లేఖలు రాశారు. మీరే స్వయంగా వచ్చి ఏపీకి రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశారని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాజధాని విషయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారనీ..ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించారనీ..దీనికి సంబంధించి జీఎన్ రావు కమిటీ కూడా జగన్ కు అనుకూలంగా నివేదిక ఇచ్చిందనీ లేఖల్లో పేర్కొన్నారు.
పచ్చని పంటలు పండే భూముల్ని రాజధాని కోసం తాము ఇచ్చామని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో తాము తీవ్రంగా నష్టాపోతున్నామని కేంద్రం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని లేఖల్లో రైతులు కోరారు. దయచేసి మూడు రాజధానుల విషయంలో ప్రధానిగా మీరు జోక్యం చేసుకోవాలని కోరుతూ అమరావతి ప్రాంతంలోని గ్రామాల రైతులు ప్రధానికి లేఖలు రాశారు. మూడు రాజధానులతో తమకు అన్యాయం జరిగిందనీ..తమకు న్యాయం జరిగేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని కార్యాలయానికి పెద్ద సంఖ్యలో రైతులు లేఖలు రాసి పంపించారు.
ఏపీకి రాజధానిగా అమరావతిని మీరు ఆమోదించి..అంగీకరించి శంకుస్థాపనకు వచ్చారనీ..దీనికి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా అంగీకరించారని లేఖల్లో పేర్కొన్నారు. మరి రైతుల లేఖల విషయంలో ప్రధాని కార్యాలయం స్పందిస్తుందా? ప్రధాని మోడీ అమరావతి రైతుల వేదన..కష్టాలు అర్థం చేసుకుంటారా? అనే విషయం వేచి చూడాలి.