చరిత్రలో ప్రథమం : జూరాల వట్టిపోయింది

జూరాల వట్టిపోయింది. వేసవి ప్రారంభంలోనే అడుగంటింది. ఫిబ్రవరిలోనే నీరు డెడ్‌స్టోరేజీకి చేరుకోవడం ప్రాజెక్ట్ చరిత్రలో ఇదే ప్రథమం. పాలమూరు జిల్లా వరప్రదాయినిగా చెప్పుకొనే జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడం వల్ల తాగునీటికి కటకట ఏర్పడుతుందని మహబూబ్‌నగర్ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో జూరాల నీటి మట్టం 2 టీఎంసీలకు పడిపోయింది. వేసవికాలంలో సైతం జూరాల ప్రాజెక్టులో కనీసం 4టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అలాంటి జూరాల ప్రాజెక్టులో నీరు ఇంకిపోవడంతో ఒండ్రుమట్టితేలింది. ప్రాజెక్టు ఎండిపోవడం వల్ల రామన్‌పాడు రిజర్వాయర్‌లో మట్టి తేలగా, జీవజమ్ములమ్మ రిజర్వాయర్‌లో నీరు ఇంకిపోయింది.
జూరాల జలాశయంలో ఉన్న నీటితో జులై మొదటి వారం వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులకు తాగునీరందాల్సి ఉంది.
రామన్ పాడు రిజర్వాయర్ నుంచి మహబూబ్ నగర్ పట్టణంతో పాటు వనపర్తి, అచ్చంపేట, జడ్చర్ల, నాగర్ కర్నూల్ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. వారం రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. వారం కింద జలాశయంలో 3.15 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ ఇప్పుడు 2.98 టీఎంసీలకు పడిపోయింది. జోగులాంబ వాటర్ గ్రిడ్‌కు జూరాల నీటిని నేరుగా తోడుకునే అవకాశముంది. తాగునీటి అవసరాల కోసం రామన్‌పాడు, గోపల్‌దిన్నె, జమ్ములమ్మ జలాశయాలకు విడుదల చేయటానికి 0.34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. జలాశయంలో 2.66 టీఎంసీల దిగువకు నీటిమట్టం పడిపోతే కాల్వలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదు. జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ చూస్తే పొదుపుగా వాడకుంటే వేసవిలో తాగునీటి గండం కూడా గట్టెక్కే అవకాశం లేదని సాగు నీటిశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు వివరించారు.
జూరాల జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా గద్వాల ప్రాంతంలోని జమ్ములమ్మ జలాశయం, వనపర్తి జిల్లాలోని రామన్‌పాడు జలాశయాలకు వారంలో ఒకసారి 900 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతున్నారు. తాగునీటి అవసరాల కోసం వదిలిన ఈ నీటిని కొందరు రైతులు అక్రమ పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని సాగు అవసరాలకు తోడిపోసుకుంటున్నారనే విమర్శలున్నాయి.