మోకాలు అడ్డుపెడితే.. ముఖ్యమంత్రి ఆగిపోతారా?

మూడు రాజధానులు అంశంపై ఏపీ మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. మోకాలు అడ్డుపెట్టినంత మాత్రాన రాజధాని తరలింపు ఆగదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. మండలిలో కుట్రలు చేసి మూడు బిల్లులను అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి.
నాలుగు రోజులు సమయం పట్టినా రాజధాని తరలింపు మాత్రం జరుగుతుందని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ తప్పకుండా చేస్తామని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. శాసనమండలిలో టీడీపీకి సంఖ్యాబలం ఉండడంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి. విచక్షణాధికారం కౌన్సిల్ చైర్మన్‌కు ఉన్నప్పుడు.. ఎక్కడినుంచి కూర్చొని పరిపాలించాలనే అధికారం ముఖ్యమంత్రికి ఉండదా? అని కన్నబాబు ప్రశ్నించారు.
ఎక్కడ సీఎం ఉంటే అక్కడ వ్యవస్థ మొత్తం ఉంటుందని అన్నారు. మండలిలో బిల్లులు అడ్డుకోవడానికి ఛైర్మన్‌కు ఉన్న విచక్షణాధికారాలు ఏంటో చెప్పాలన్న కన్నబాబు.. మండలి ఛైర్మన్ అధికారాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాజధాని తరలింపు అడ్డుకుంటున్నారని కన్నబాబు ఆరోపించారు.