ఏపీ కేబినేట్‌లో కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక ఎన్నికలపై మంత్రులతో మాట్లాడారు జగన్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను.. అధికారులు ప్రభుత్వానికి అందించారు. 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీపై కేబినెట్‌లో చర్చించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, ఎన్‌పీఆర్‌పై ఈ కేబినెట్‌లో చర్చ జరిగింది.
కేబినేట్ భేటి తర్వాత మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
కేబినేట్ తీసుకున్న కీలక నిర్ణయాలు:
– మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం.
– 43,101 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
– ఇంటి పట్టాను నిర్దేశిత ఫార్మాట్‌లో ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది.
– ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు ఐదేళ్ల పాటు ఇళ్లు కట్టుకునేందుకు, లేదా వ్యక్తిగత అవసరాలకు బ్యాంకులో తనఖా పెట్టుకునే హక్కు కల్పిస్తూ.. ఐదేళ్ల తరువాత దానిని అమ్ముకునేందుకు కూడా హక్కు కల్పిస్తున్నారు.
– ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అందరూ తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రర్ హోదా ఇస్తున్నారు.
– 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక
– పేదలకు ఇచ్చే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం
– ఎన్‌పీఆర్‌లో మార్పులు కోరుతూ కేబినెట్ తీర్మానం
– 2010లో ఉన్న ప్రశ్నలకు పరిమితం అవుతూ మార్పులు చేసేవరకూ.. రాష్ట్రంలో ఎన్‌పీఆర్ ప్రక్రియ నిలిపివేయాలని కేబినెట్ తీర్మానం
– రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మించాలని నిర్ణయం
– భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో జీఎమ్మార్‌కు ఇచ్చిన 2700 ఎకరాలు 2200కు కుదింపు
– ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుమతులు
– ఏపీ స్టేట్ సీడ్ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు ఆమోదం
– విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌లో పురోగతిలో ఉన్న 800 మెగా వాట్ల విద్యుత్ కేంద్రం, అలాగే కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌ను పూర్తి చేసేందుకు ఏపీ జెన్‌కో రూ.1000 కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్లో ఆమోదం. ప్రభుత్వం నుంచి వీటికి బ్యాంకు గ్యారెంటీ.
– ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో టీడీపీకి కేటాయించిన రెండు ఎకరాల భూ కేటాయింపులు రద్దు.