మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం

నిజామాబాద్ జిల్లా మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. కార్యాలయం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేసింది. రెవెన్యూ సేవలు నిలిచిపోవడంతో మండల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏడాది నుంచి అద్దె చెల్లించడం లేదని యజమాని వాపోయింది. ఇంటి యజమాని గుంగూబాయి తన ఇంటిని మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయం కోసం అద్దెకు ఇచ్చింది. 2018 నుంచి అద్దె చెల్లించడం లేదు. లక్షా 20 వేల రూపాయలు గంగూబాయికి రావాల్సివుంది.
అద్దె చెల్లించాలని పలు మార్లు అధికారులను అడిగినా పట్టించుకోలేదు. దీంతో ఇంటి యజమాని గుంగూబాయి బుధవారం (మే 15, 2019) మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసింది. అద్దె డబ్బులు చెల్లిస్తేనే కార్యాలయం తాళం తీస్తానని తెలిపింది. దీంతో కార్యాలయం సేవలు నిలిచిపోయాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పందించిన తహసీల్దార్ వెంటనే కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీశాడు. కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు. త్వరలో బాకీ తీరుస్తామని ఆదేశాలిస్తామని ఇంటి యజమానికి కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆమె కార్యాలయం తాళం తీసింది.