August 5 : అయోధ్యలో రామమందిర శంకుస్థాపన..అమెరికాలో LED మెరుపుల్లో వెలిగిపోనున్న శ్రీరాముడు

అమెరికాలోని న్యూయార్ నగరంలో శ్రీరాముడి ఫోటోలతో మెరిసిపోనుంది. అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగనున్న వేడుకతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల దశాబ్దాల కల ఆగస్ట్ 5వ తేదీన నిజంకాబోతోంది.
ప్రధాని నరేంద్ర మెడీ చేతుల మీదుగా శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ వేడుకను పురస్కరించుకుని ఇదే సమయంలో భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లోనూ ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని వేడుకలా చేసేందుకు ఏర్పాట్లు ముమ్మురంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 5వ తేదీన రాముడి ఫొటోలు, నూతనంగా నిర్మించబోయే అయోధ్య శ్రీరాముడి ఆలయానికి సంబంధించిన ఫొటోలు న్యూయార్క్ నగరంలో LED స్క్రీన్ పై మెరవనున్నాయి. ఇది చారిత్రాత్మక సంఘటన అని శ్రీరామ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ఉన్న భారీ బిల్‌బోర్డ్స్‌లో ఆగస్ట్ 5వ తేదీన రాముడికి సంబంధించిన ఫొటోలు డిస్ప్లే కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయని అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెహ్వీనీ బుధవారం (జులై 29,2020)తెలిపారు. ఆగస్టు 5 ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు హిందీ మరియు ఆంగ్లంలో ‘జై శ్రీ రామ్’అనే మాటలతో మారుమోగుతాయని తెలిపారు.