నిజామాబాద్ లో టెన్షన్ : గాంధీ విగ్రహానికి మసి పూసి..పాక్ నినాదాలు

భారత జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. గాంధీ మహాత్ముడి విగ్రహానికి గుర్తు తెలియని అగంతకులు నల్లరంగు పూసారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎవరు చేసిఉంటారు? ఉగ్రవాదులా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
నిజామాబాద్ జిల్లాలో పలుమార్లు ఉగ్రవాద కదలికలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిజామాబాద్‌లోని గుండారంలో మహాత్మాగాంధీ విగ్రహానికి మసి పూసిన అగంతకులు.. దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ వేశారు గాంధీ మెడలో వేశారు. గాంధీ విగ్రహానికి నల్లరంగు పులిమి ఉండటం.. మెడలో ఏదో దండ వేలాడుతుండటం గమనించిన స్థానిక యువత దగ్గరకెళ్లి వాటిని పరిశీలించారు.
దాంట్లో పాకిస్తాన్ జిందాబాద్.. ఇండియా డౌన్ డౌన్.. జిహాద్.. షాదుల్లాను విడుదల చేయాలి.. కశ్మీర్ పాకిస్తాన్‌దే.. అంటూ రాసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా గ్రామంలో తీవ్ర ఆందోళనతో కూడిన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సదరు యువత మున్సిపల్ అధికారులకు..పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాంధీ విగ్రహాన్ని.. మెడలో ఉన్న దండలో ఉన్న పేపర్ లను పరిశీలించారు. ఈ ఘటనతో అసాంఘిక శక్తుల కదలికలు ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.