వాలంటీర్ల జాబ్‌లన్నీ వైసీపీ కార్యకర్తలకే – విజయసాయి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరికొత్త వివాదానికి తెరలేపారు. విశాఖపట్నంలో కార్యకర్తల మీటింగ్‌లో పాల్గొన్న ఆయన వాలంటీర్ల జాబ్‌లపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల జాబ్‌లన్నీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చామని స్వయంగా ప్రకటించడం దుమారం రేపుతోంది. 100 రోజుల పాలనలోనే దాదాపు 3లక్షల మందిని ప్రభుత్వంలో వాలంటీర్లుగా నియమిస్తే.. అందులో 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలే అనడం విపక్షాలకు కొత్త అస్త్రంగా మారింది.
ఇప్పటికే గ్రామ సచివాలయ పరీక్షలు రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పరీక్షలను రద్దు చేయాలని, APPSC ఉద్యోగుల కుటుంబాల సభ్యులకు ర్యాంకులు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. జనసేన అధినేత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. తాజాగా ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు అస్త్రంగా మారిందనే చెప్పవచ్చు.
మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వం… ఉన్నతాశయాలతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొత్తగా ఎంపికైన వాలంటీర్లకు ఐడీ కార్డులను అందచేశారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకరావాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలతో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.
Read More : గ్రామ సచివాలయ పరీక్షలు : APPSC ఉద్యోగుల కుటుంబసభ్యులకే ర్యాంకులు – బాబు