వారణాసిలో వేధింపులు : మోడీపై పోటీ చేస్తున్న నిజామాబాద్ రైతుల ఇబ్బందులు

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు వారణాసికి వెళ్లిన రైతులకు ఇబ్బందులు సృష్టించారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ప్రపోసర్స్ సంతకాలు చేయకుండా అడుగడుగునా అడ్డుకున్నారని వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఇండిపెండెంట్ క్యాండెట్స్ లోక్ సభ స్థానానికి పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గం నుండి స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉండిన పది మంది మద్దతు తెలియాల్సి ఉంటుంది. ఏప్రిల్ 26వ తేదీన రాత్రి రైతులు ఇక్కడకు చేరుకున్నారు.
ఏప్రిల్ 29వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం నామినేషన్ల సమర్పణకు మద్దతు దారుల కోసం రైతులు వెతికారు. స్థానికులను కలిసి సమస్యలు వివరించి తమకు మద్దతు తెలియచేయాలని కోరారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది అడ్డుకుని సంతకాలు పెట్టనీయకుండా అడ్డుకున్నారని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానిక రైతు సంఘాల నాయకులను, న్యాయవాదులను కలిసి రైతులు మద్దతు కోరారు.
నిజామాబాద్ నుండి రైతులు ఈనెల 22వ తేదీన ప్రత్యేక బోగీలో వారణాసి వెళ్లాలని అనుకున్నారు. రైల్వే అధికారులు బోగీ కేటాయించే అంశంపై తాత్సారం చేశారు. చివరకు 24వ తేదీ కూడా ప్రత్యేక బోగీ ఇవ్వడం కుదరదని చెప్పారని రైతులు వెల్లడించారు. దీంతో గత్యంతరం లేక ప్రైవేటు బస్సులో ఏప్రిల్ 25వ తేదీన జిల్లాల నుండి బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు.