ఉత్తరాంధ్రలో కరోనా విచిత్రం.. విశాఖలో భయం, భయం.. విజయనగరం, శ్రీకాకుళం సేఫ్.. ఎందుకిలా

ఏపీలో కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం(ఏప్రిల్ 12,2020) సాయంత్రానికి

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 10:32 AM IST
ఉత్తరాంధ్రలో కరోనా విచిత్రం.. విశాఖలో భయం, భయం.. విజయనగరం, శ్రీకాకుళం సేఫ్.. ఎందుకిలా

Updated On : April 13, 2020 / 10:32 AM IST

ఏపీలో కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం(ఏప్రిల్ 12,2020) సాయంత్రానికి

ఏపీలో కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం(ఏప్రిల్ 12,2020) సాయంత్రానికి 420 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 12 మంది వైరస్ నుంచి కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 388 మంది ఆస్పత్రిలో ఐసొలేషన్‌లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో కరోనా కేసుల పరిస్థితి ఒక్కోలా ఉంది. ఉత్తరాంధ్రలో పరిస్ధితి మరీ భిన్నంగా ఉంది. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు ఉంటే.. రెండు జిల్లాలు సేఫ్ గా ఉన్నాయి. అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ మరో జిల్లాలో మాత్రం కరోనా బీభత్సంగా ఉంది.

రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ జిల్లాలు రెండు:
విశాఖపట్నంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. కానీ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మాత్రం ప్రస్తుతం అత్యంత సురక్షితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాని జిల్లాలు ఈ రెండే. మార్చి 20న విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి 27 వరకు కేవలం 4 కేసులే రికార్డయ్యాయి. కానీ, ఏప్రిల్ మొదటి వారానికి ఆ సంఖ్య 20కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా వైరస్ కేసులు విస్తరించాయి. పద్మనాభం మండలంలోని వెంకటాపురం గ్రామంలో లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడి కుటుంబానికి వైరస్ సోకింది. నర్సీపట్నంలో తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకింది. దీంతో క్రమంగా విశాఖలో ఆందోళన పెరగసాగింది.

ఢిల్లీ తబ్లీగీ జమాత్ తర్వాతే:
ఇటీవల ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్నవారిలో కొందరు విశాఖ వాసులూ ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చిన 20 మందిని అధికారులు గుర్తించారు. వారు కలిసిన మరో 42 మందిని కూడా పట్టుకొని పరీక్షలు జరిపించారు. అలా మొత్తం పాజిటివ్ కేసులు 20కి చేరగా, మరో 173 మందిని ఐసొలేషన్‌లో ఉంచారు. చెస్ట్ ఆసుపత్రిలో మరో 163 మంది అనుమానితులు ఉన్నారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం 66 క్వారంటైన్ కేంద్రాలు, వాటిలో 9307 పడకలు, 500 మందికి సరిపడా ఐసోలేషన్ వార్డులూ సిద్ధంగా ఉన్నాయి.

విశాఖలో 5 రెడ్ జోన్లు:
విశాఖ నగరంలో పాజిటివ్ కేసులు నమోదైన అల్లిపురం, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని శాంతి నగరం, తాటిచెట్లపాలెం, పూర్ణ మార్కెట్, గాజువాక ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. వీటికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో నాలుగు వార్డులను కూడా రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చారు. నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో దాన్ని కూడా రెడ్ జోన్‌గా పరిగణిస్తున్నారు.

కరోనావైరస్ హాట్ స్పాట్ గా విశాఖ:
రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇళ్ల చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో నివాసాలు, రహదారులు, విద్యుత్ స్తంభాలపై హైపోక్లోరినేట్ ద్రావణం స్ప్రే చేశారు. ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా, అక్కడి వారు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క విశాఖ జిల్లాను కరోనావైరస్ హాట్ స్పాట్‌గా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. పాజిటివ్ కేసులున్న చోటుకు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇలాంటివి విశాఖలో 7 ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలను పూర్తిగా మూసివేసి ప్రభుత్వమే నిత్యావసరాలను ఇళ్లకు చేరవేస్తోంది.

విశాఖలో కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు:
ప్రస్తుతం విశాఖలో 23 షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. వీటిలో 2 వేల మంది పేదలు ఉంటున్నారు. జిల్లాకు ఇటీవల 3117 మంది విదేశాల నుంచి వచ్చారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. వారిని ఇప్పటికే క్వారంటైన్‌కు పంపించామన్నారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన వారితో పాటుగా వారితో ప్రయాణం చేసిన, కాంటాక్ట్ అయిన మరో 62 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపామన్నారు. వీరిలో 15 మందికి పాజిటివ్ రావడంతో వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. స్టేట్ కోవిడ్ హాస్పిటల్‌గా విశాఖలోని విమ్స్ ఉందని, అక్కడ 500 పడకలను సిద్ధం చేశామని వివరించారు.

జిల్లా కోవిడ్ ఆస్పత్రులు చోడవరం, మాడుగుల, యలమంచిలి, పాడేరు, నర్సీపట్నంలో ఉన్నాయి. నగరంలో గీతం, రామ్ నగర్ అపోలో, కేర్, ఎన్టీఆర్, గాయత్రి ఆస్పత్రుల్లో 2700 మందికి సరిపడా ఐసోలేషన్ బెడ్‌లు ఏర్పాటు చేశారు. మరికొన్ని ఆస్పత్రుల్లో, రుషికొండ బీచ్ రిసార్టుల్లో కరోనా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా చెస్ట్ హాస్పిటల్, రుషి కొండ బీచ్ రిసార్టుల్లో కరోనా సెంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది అనారోగ్యం పాలైతే, వారికి చికిత్స అందించేందుకు పినాకిల్ ఆస్పత్రిని కేటాయించారు.

ప్రస్తుతం విశాఖ నగరంలో ఉన్న ఒక్క టెస్టింగ్ ల్యాబ్‌లో రోజుకు 60 నుంచి 100 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ‘‘జిల్లాలో 12 వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. 18వేల ఎన్ 95 మాస్కులు, 4 లక్షల జతల గ్లౌజులు, దాదాపు 40 వేల లీటర్ల శానిటైజర్ అందుబాటులో ఉంది. ఆంధ్రా మెడికల్ కాలేజీ పరిధిలోని 1000 మంది డాక్టర్లు చికిత్స కోసం అందుబాటులో ఉన్నారు. వీరిని నాలుగు భాగాలుగా విభజించాం. ఒక విభాగం ఎప్పుడూ సెలవులో ఉంటుంది. ఒక బృందం రిలీవ్ అవగానే మరో బృందం అందుబాటులో ఉంటుంది’’ అని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.డాక్టర్ సుధాకర్ తెలిపారు.

విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో వెంటిలేటర్లు, పీపీఈల ఉత్పత్తి:
కాంటాక్ట్ కేసులు పెరగకుండా చూడటంపైనే ప్రస్తుతం అధికారులు దృష్టిపెట్టారు. కొందరిలో 21 రోజులకు కూడా కరోనా లక్షణాలు కనిపిస్తుండడంతో 14 రోజుల క్వారంటైన్ పూర్తయినా, మరో 14 రోజులపాటు ఇతరులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోపక్క విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్‌లో వెంటిలేటర్లు, పీపీఈల ఉత్పత్తిని కూడా ఇప్పటికే మొదలుపెట్టారు.

శ్రీకాకుళం, విజయనగరం.. కరోనా ఫ్రీ.. అయినా జాగ్రత్తలు..
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో విశాఖ పరిస్థితి ఇలా ఉంటే.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రం మొత్తంలో కేసుల లేని జిల్లాలు ఈ రెండే. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో కూడా అన్ని జాగ్రత్తలూ కట్టుదిట్టంగా పాటిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్యూఆర్‌ కోడ్‌ కేటాయించారు. వారిలో ప్రతి 10 మందికీ ఒక కోవిడ్‌ అధికారిని నియమించారు. వారిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటోంది. ఒకవేళ కేసులు వస్తే ఎలా ఎదుర్కోవాలి? రోగులను తీసుకురావడం, ఆస్పత్రికి షిప్ట్‌ చేయడం, వారి చికిత్స తదితర అంశాలపై పర్యవేక్షకులకు శిక్షణ ఇస్తున్నారు.

విజయనగరంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే, పక్కాగా లాక్ డౌన్‌ అమలు:
విజయనగరంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే, లాక్ డౌన్‌ని పక్కాగా అమలు చేస్తున్నారు.‌ మండల స్థాయిలో ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేశారు. ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఇరుక్కుపోయిన వారు, బిచ్చగాళ్లు లాంటి వాళ్లకి వసతి కోసం ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 35 ఉపశమన కేంద్రాల ద్వారా నిత్యం భోజనం అందిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం 18, స్వచ్ఛంద సంస్థలు 17 నడుపుతున్నాయి.