మంగళగిరిలో నారా లోకేష్ కు ‘నోటా’ టెన్షన్ : 2014లో ఏం జరిగిందంటే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యి రెండు వారాలు అయ్యింది. కానీ అనేక చోట్ల గెలుపుపై స్పష్టమైన క్లారిటీ లేక అన్నీ చోట్ల అభ్యర్ధులు ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ బరిలో నిలబడిన స్థానం మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితి గురించి ఇప్పడు రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశం అయింది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎప్పుడు కూడా ప్రతికూల వాతావరణమే ఉంది.
ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. గత 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్ధి గంజి చిరంజీవిపై గెలుపొందారు. అయితే అప్పుడు నోటాకు పడిన ఓట్లు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గెలుపుపై టెన్షన్ పెడుతున్నాయి. గత ఎన్నికల్లో నోటాకు 635 ఓట్లు పోల్ అవగా నోటకు పడిన ఓట్లు ఈసారి కీలకం కానున్నాయి అని అంటున్నారు.
గత ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపోటములను ఇక్కడ నోటా డిసైడ్ చేయగా.. వైసీపీ అభ్యర్థి గెలిచారు. నోటాకు పడిన ఈ ఓట్లలో కొన్ని టీడీపీకి ట్రాన్స్‌ఫర్ అయి ఉంటే మాత్రం మంగళగిరిలో అప్పుడు ఫలితం మారి ఉండేది. ఈ నేపథ్యంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో నోటాకు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనే విషయమై టీడీపీలో ఆందోళన మొదలైంది.
ఒకవేళ గత ఎన్నికల్లో జరిగినట్లే నోటాకు ఎక్కువ ఓట్లు పోల్ అయి ఉంటే.. ఈసారి అది ఏ పార్టీకి మేలు చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఎంచుకున్న ఓటర్లలో ఎక్కువగా తటస్తులు, విద్యావంతులు అనే అంచనా ఉంది. చిరంజీవి-ఆళ్ల మధ్య పోటీలో నోటా వైపు మొగ్గు చూపిన ఈ ఓటర్లు.. ఈసారి కూడా అదే సంఖ్యలో ఉంటారా? లేక వారు ఏదైనా పార్టీకి మద్దతు తెలిపి ఉంటారా? అనే దాన్ని బట్టి టీడీపీ క్యాడర్ ఇక్కడ గెలుపు గురించి అంచనాలు వేసుకుంటుంది.