ఉల్లిపాయలు ఏరిన పవన్ : పాలన చేయటం చేతకాకుంటే..మళ్లీ ఎన్నికలు పెట్టండి

ఏపీ ప్రభుత్వానికి పాలన చేయటం చేతకాకపోతే తప్పుకుని మళ్లీ ఎన్నికలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూల్చివేతలు..కాంట్రాక్టుల రద్దుపైనే దృష్టి పెట్టింది తప్ప పాలన మీద కాదంటూ విమర్శించారు. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ రైతు బజార్లలో ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి అనే విషయంపై ఆరా తీశారు.
ఉల్లిపాయల ధరలు ఆకాశన్నంటుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఉల్లిపాయల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయనీ..ధరల పెరుగుదలతో కాయకష్టం చేసి పంట పండించిన రైతులు నష్టపోతున్నారు. మరోపక్క ఉల్లిపాయల్ని అధిక ధరలు చెల్లించి కొనుక్కుంటున్న ప్రజలు నష్టపోతున్నారనీ.. దళారులు మాత్రం బాగుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉల్లిపాయల కోసం రోజంతా ప్రజలు రైతు బజార్లలో పడిగాపులు పడుతున్నారనీ..ప్రభుత్వం చేతకానితనం వల్లనే ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.
ఉల్లి పండించిన రైతులు గిట్టుబాటు ధరలేక కష్టపడుతుంటే..వాటిని అధిక ధరలకు కొనుక్కున్న వినియోగదారులు కూడా కష్టపడుతున్నారనీ..కేవలం దళారులు మాత్రమే బాగు పడుతున్నారనీ..దళారీ వ్యవస్థ విషయంలో ప్రభుత్వ పాలన లోపం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని పవన్ ఆరోపిస్తు విమర్శించారు.