క్లారిటీ లేని జనసేనాని : అయోమయంలో పార్టీ క్యాడర్

అమరావతి : యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల కిందటే చెప్పారంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు పవన్ కల్యాణ్.. పాక్ మీడియా, నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను ఉదహరించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తను వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణిచ్చుకున్నారు.. ఈ ఒక్క విషయంలోనే కాదు.. పార్టీ వ్యవహారాల్లోనూ ఆయనలో స్పష్టతలేమి, వ్యూహారచన ఉండటం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.
మరోపక్క అటు పార్టీ వ్యవహారాల్లోనూ , రాజకీయంగా నిర్ణయాలు ప్రకటించడంలోనూ.. పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశ్యం చేయడంలో ఆయన ఇంకా వెనుకబడే ఉన్నారనే వాదన ఉంది.. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయన ప్రస్తావిస్తున్నారంటున్నారు.. ఏ నిర్ణయమైనా అంటే ఏంటని పార్టీ కోర్ టీం సభ్యులతో పాటు మిగతా వాళ్లు చర్చించుకుంటూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లా టీడీపీ, వైసీపీతో వెళ్లను అని జనసేనాని వివరణ ఇస్తున్నా.ఏపీ ప్రజల్లో ముఖ్యంగా పవన్ అభిమానులైన జనసైనికుల్లో ఎక్కడో ఓ అనుమానం.. ఇలా పొత్తుల విషయంలో క్యాడర్ లో క్లారిటీ రావటంలేదు..అలాగని పవన్ కూడా క్లారిటీ ఇచ్చేందుకు యత్నించటంలేదంటున్నారు పార్టీ వర్గాలు.
ఇప్పటికి ఆయన ఆరేడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించటంతో అసలు ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు.. కాకినాడ రూరల్ నుంచే పోటీ చేస్తారని ఆ పార్టీ నేత ముత్తా గోపాలకృష్ణ ఓ ప్రకటన చేశారు. అలాగే పిఠాపురం, అనంతపురం, కదిరి తో పాటు ఎస్సీ రిజర్వుడు అయిన పాయకరావు పేట నుంచి కూడా పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు.. ఇప్పటికీ ఆయన ఎక్కడి నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ లేదు.. గతంలో కూడా ఏలూరులో నివాసం ఏర్పాటు చేసుకుంటా.. ఇక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు.. ఇలా చాలా సందర్బాల్లో మాటల్లో చేతల్లో పార్టీ అధినేతలో నిలకడలేమి క్యాడర్ కు అయోమయానికి గురి చేస్తోంది..