వెల్దుర్తి రోడ్డు ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నాయకులు

కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుంతకల్లుకు పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు చెబుతున్నారు.
వెల్దుర్తి దగ్గర ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై మోడీ ట్విట్టర్ లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరంటూ ట్వీట్ చేశారు.
బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం కేసీఆర్… గద్వాల జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ప్రైవేట్ బస్సులు అతివేగంగా వెళ్తున్నా రవాణ శాఖ పట్టించుకోవడం లేదని విమర్శించారు. రహదారి నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు.