పొంగులేటి అనుచరుల ఆందోళన : ఖమ్మం TRS ఎంపీ సీటు రగడ

  • Published By: madhu ,Published On : March 24, 2019 / 11:51 AM IST
పొంగులేటి అనుచరుల ఆందోళన : ఖమ్మం TRS ఎంపీ సీటు రగడ

Updated On : March 24, 2019 / 11:51 AM IST

ఖమ్మం ఎంపీ సీటు విషయంలో TRS నేతల్లో అసంతృప్తి నెలకొంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆయన అనుచరులు ఆందోళన చేయడం కలకలం రేగింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు టికెట్ దక్కిన విషయం తెలిసిందే. దీనితో పొంగులేటి అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మార్చి 24వ తేదీ ఆదివారం పొంగులేటి నివాసానికి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయాలని నినాదాలు చేశారు. వారి నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. 

ఐదేళ్ల కాలంలో పొంగులేటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని..నామా నాగేశ్వరరావుకు ఎలా టికెట్ కేటాయిస్తారని నేతలు ప్రశ్నించారు. వెంటనే సీఎం కేసీఆర్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకొని పొంగులేటి అక్కడకు వచ్చారు. సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా నేతలు, కార్యకర్తలు వినిపించుకోలేదు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని శ్రీనివాసరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో YCP నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం TRSలో చేరారు పొంగులేటి. ఈసారి కూడా తనకే ఛాన్స్ వస్తుందని పొంగులేటి భావించారు. టీడీపీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావుకు గులాబీ బాస్ కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీనిపై పొంగులేటి వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యింది. మార్చి 25వ తేదీ సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ప్రస్తుతం టికెట్ దక్కపోవడంతో పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.