కేఏ పాల్ నామినేషన్‌లో ట్విస్ట్: పోటీలో ఉండడం డౌటే!

విచిత్రమైన చేష్టలు చేస్తూ.. చిత్రమైన స్టేట్‌మెంట్‌లు ఇస్తూ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ప్రజా శాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటుకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పాల్ నరసాపురం లోక్‌సభ సెగ్మెంట్‌లో నామినేషన్ దాఖలు చేశారు.
అయితే పాల్ ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించాల్సిన అఫిడవిట్‌ను నామినేషన్ పత్రాలతో ఇవ్వలేదని తెలుస్తుంది. నామినేషన్ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు.. ప్రాథమిక వివరాలతో కూడిన దరఖాస్తును మాత్రమే కేఏ పాల్ అందజేసినట్లు చెబుతున్నారు.
అంతేకాదు బ్యాంకు ఖాతాతో పాటు ఆస్తులకు సంబంధించిన వివరాల ఖాళీ పత్రాలు అందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాల్ నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం(2019 మార్చి 25) సదరు పత్రాలు ఇవ్వకుంటే పాల్‌కు పోటీ చేసే అవకాశం ఉండదు.