రిపబ్లిక్ డే 2019 : చీఫ్ గెస్ట్ సౌతాఫ్రికా ప్రెసిడెంట్

ఢిల్లీ : రిపబ్లిక్ డే 2019 వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమౌతోంది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది గణతంత్ర వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ దేశాల ప్రముఖులను భారతదేశ ప్రభుత్వం ముఖ్యఅతిథులుగా ఆహ్వానిస్తూ ఉంటుంది. ఈ ఏడాది సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు, బ్రిక్స్ దేశాల భాగస్వామి సిరిల్ రాంపోసాను ముఖ్య అతిధిగా రానున్నారు. జీ 20 సమ్మిట్ సమావేశాలకు వెళ్లిన ప్రధాన మంత్రి మోడీ ఆయన్ను ఆహ్వానించారు. గాంధీ 150వ జయంతి..దక్షిణాఫ్రికాతో గాంధీకి అనుబంధం ఉండడంతో మోడీ ఆయన్ను ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతాయని మోడీ వెల్లడించారు.
రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఆ రోజు నేషనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. రిపబ్లిక్ డేని..గణతంత్ర దినోత్సవం అని కూడా అంటారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బాపూజీ జీవితాన్ని ప్రతిబింబించేలా శకటాలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రముఖ విదేశీ అతిధుల కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.