పరేడ్ లో ఫస్ట్ : సత్తా చాటనున్న నారీ శక్తి

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 05:11 AM IST
పరేడ్ లో ఫస్ట్ : సత్తా చాటనున్న నారీ శక్తి

న్యూఢిల్లీ: 2019 రిపబ్లిక్ డేలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. జనవరి 26వ తేదీ 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలో “నారీ శక్తి” (మహిళా పవర్) ప్రదర్శన చేయనుంది. మొదటిసారి పరేడ్ లో మహిళా భద్రతా దళాలు పరేడ్ ప్రారంభించనుండటం విశేషం. అసోం రైఫిల్స్ కింద శిక్షణ పొందిన 30 మంది మహిళా భద్రతా దళం తన సత్తాను చాటనుంది. దేశంలోని అతి పురాతన పారామిలిటరీ బలగాల బృందానికి నాయకత్వం వహించటం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు ఈ మహిళలు.

మహిళలు ఎందులోనూ తీసిపోరని ఈ ప్రదర్శన ద్వారా నిరూపిస్తాం అంటున్నారు కెప్టెన్ శిఖా సురభి. ఆమె జట్టు సహచరులతో కలిసి బైక్ విన్యాసాలు చేయనున్నారు. నేను డేర్ డెవిల్స్ విభాగంలో మొట్టమొదటి మహిళను అని గర్వంగా చెబుతున్నారు. స్టంట్స్ ప్రాక్టీస్ చేయడానికి చాలా సమయం తీసుకున్నామని.. ఎంతో సాహసంగా కూడిన విన్యాసాలు దేశంలోని మహిళలు అందరికీ స్ఫూర్తిగా ఉంటాయని భరోసా ఇస్తున్నారు. దేశంలోని మహిళలు ఎందులోనూ తీసిపోరని నిరూపిస్తామని ధీమాగా అంటున్నారు కెప్టెన్ సురభి. మహిళలు ఏమైనా చేయగలరు అంటూ బైక్ ప్రదర్శన ద్వారా నిరూపిస్తామన్నారామె. 

2019 రిపబ్లిక్ డే వేడుకల్లో 90 ఏళ్ల వయస్సు ఉన్న నలుగురు సైనికాధికారులు పాల్గొనటం మరో విశేషం. ఇటీవలే అమెరికా నుంచి కొనుగోలు చేసిన యూఎస్ కె9 తుపాకులు, ఫిరంగుల ప్రదర్శన కూడా అదనపు ఆకర్షణగా నిలవనుంది.