సంక్రాంతి థర్డ్ డే : ఏపీలో ఘనంగా కనుమ

విజయవాడ : రాష్ట్రంలో సంక్రాంతి మూడోరోజు కనుమ పండుగ ఘనంగా జరిగింది. పలు చోట్ల ఎడ్ల పందాలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాగే.. జనవరి 16వ తేదీ కూడా కోడి పందాలను యధేచ్ఛగా నిర్వహించారు. చివరి రోజు కావడంతో వీటిని చూడ్డానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పశువుల పండగకు చంద్రగిరి నియోజకవర్గం ఫేమస్. రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, దలయ్యగారిపల్లెల్లో పశువుల్ని అందంగా అలంకరించి కొమ్ములకు పలకలు కట్టి పరిగెత్తించారు. వీటిని అందుకునేందుకు యువత పోటీపడ్డారు. పోలీసుల హెచ్చరికల్ని ఏమాత్రం పట్టించుకోకుండా పోటీల్లో పాల్గొన్నారు.
పర్చూరు మండలం…
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 31 వ జిల్లా స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలను మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి తీసుకొచ్చిన సుమారు వంద జతల ఎడ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. పాలపళ్ళు, రెండు పళ్లు, నాలుగు పళ్లు, ఆరు పళ్లు, ఎనిమిది పళ్లు, సీనియర్స్, జాక్ పట్టు విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
ఎడ్లబండి పోటీలు…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరపలోనూ ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు వీటిని ప్రారంభించారు.
అటు… కోడి పందేలు కూడా జోరుగానే సాగాయి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మేడపాడులో పెద్ద ఎత్తున కోడి పందాలు జరిగాయి. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. హైస్కూల్ ఆవరణలోనే పోటీలు నిర్వహించారు. పందెం రాయుళ్లు లక్షల్లో పందేలు కడుతూ బరుల్లో హల్‌చల్ చేశారు.
కోళ్ల పందేలు…
అటు.. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పెద్ద ఎత్తున కోడి పందాలను నిర్వహించారు. భీమడోలు సమీపంలోని గుండుగోలనులో ఏర్పాటు చేసిన బరులకు జనం భారీగా తరలి వచ్చారు. కృష్ణా జిల్లాలో మూడో రోజు కూడా కోడిపందాలు యధేచ్ఛగా జరిగాయి. పండగ ఆఖరి రోజు కావడంతో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. గుడివాడ, ఈడుపుగల్లు, భవానీపురం, యనమలకుదురు, పులిపాక, కొత్తూరు తాడేపల్లి, జగ్గయ్యపేట, అవనిగడ్డలో భారీగా కోడిపందాలు జరిగాయి. శిబిరాల వద్ద కోడిపందాలతో పాటు పేకాట, నెంబర్ గేమ్స్, గుండాటలో కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగింది. పోలీసులు, అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా పందెం రాయుళ్లు పట్టించుకోలేదు. జనవరి 17వ తేదీ గురువారం కూడా కోడి పందేలు జరిగే అవకాశం ఉంది.