నిర్లక్ష్యమే కారణమా : సరాళా సాగర్ ప్రాజెక్టుకు గండి..పరిశీలించిన మంత్రి

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకరయ్యపేట గ్రామ సమీపంలోని చిన్నవాగు నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి పడింది. దాంతో నీరు భారీగా వృథాగా పోతోంది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు నీటితో నిండి కళకళలాడుతోంది. ఆసియాలోనే ఆటోమేటిక్ సైఫన్ల టెక్నాలజీతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగం ప్రత్యేకత.
సరళాసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 22 అడుగులు. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో అప్పటికే ఉన్న లీకేజీలు పెద్దవై గండి పడినట్లు సమాచారం. ప్రాజెక్టు నుంచి నీరు కొత్తపల్లి వాగు, రామన్‌పాడు డ్యాంలలోకి చేరుతుంది. దాంతో రామన్‌పాడు డ్యాంకు చెందిన 10 గేట్లు ఎత్తారు. ఆసియాలోనే సైఫన్ సిస్టంతో నిర్మించిన రెండవ ప్రాజెక్టు ఇది. దీనిని 1960లో నిర్మించారు.
నిజాం హయాంలో వనపర్తి సంస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన సరళాసాగర్ డ్యాం ప్రమాదపుటంచుకు చేరింది. 4200 ఎకరాలకు సాగునీరిచ్చే ఈ డ్యాం సరైన నిర్వహణలేక, మరమ్మత్తులకు నోచుకోక బీటలు వారింది. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టుకు బీటలు పడ్డాయి. ఈ బీటలను 25 ఏళ్ల క్రితమే గుర్తించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి మరమ్మత్తు చర్యలు తీసుకోలేదు. ఆందోళన చెందిన రైతులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితం ప్రాజెక్టుకు భారీ గండి, నీరు వృథా. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ప్రాజెక్టుకు మరమ్మత్తు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కాగా భారీ గండి పడిన సరళా సాగర్ ప్రాజెక్టును మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. గండి పడటానికి గల కారణాలేమిటో తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇంజనీర్లతోను..సాంకేతిక నిపుణులతోను ఈ అంశంపై చర్చిస్తామని వెంటనే చర్యలు తీసుకుంటామని తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.