విజయవాడలో డ్రోన్లతో కరోనా కట్టడి, సోడియం హైపో క్లోరైడ్ పిచికారి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. గత రెండు రోజులుగా ఊహించని విధంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఉండటంతో విజయవాడ నగర పాలక సంస్ధ అధికారులు పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు.
విజయవాడ నగరంలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల రింగ్‌రోడ్డు, రమేష్ ఆస్పత్రి రింగ్‌రోడ్డు, విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్‌షాప్, లబ్బీపేటలోని ఉషాకార్డియాక్ సెంటర్, రైల్వే ఆస్పత్రి, రైల్వే స్టేషన్ ప్రాంతాలు, రాజరాజేశ్వరీ పేటలోని వీఎంసీ మెటర్నటీ ఆస్పత్రి, చెక్‌పోస్టు వద్దనున్న లిబర్టీ హాస్పిటల్ వద్ద డ్రోన్‌ల సాయంతో పిచికారీ చేస్తున్నారు.
నగరంలో ఐదు డ్రోన్ల సాయంతో.. ఒక్కో డ్రోన్‌లో 5 లీటర్ల చొప్పున ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తున్నారు. హైపో క్లోరైడ్ డిస్‌ఇన్ఫెక్షన్ వల్ల వైరస్ క్షణాల్లో చనిపోతుందని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటోన్మెంట్(కాలుష్య) జోన్లు, ఐసోలేషన్ కేంద్రాలతోపాటు నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఈ విధంగా పిచికారీ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు.
రాజరాజేశ్వరిపేట కరోనా పాజిటివ్ కంటోన్ మెంట్ జోన్ లో డ్రోన్ తో సోడియం హైడ్రో క్లోరైడ్ చల్లించిన ప్రాంతాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. 47 వ డివిజన్ లో మంత్రి వెల్లంపల్లి ఫైర్ ఇంజన్ తో స్వయంగా సోడియం హైడ్రో క్లోరైడ్ స్ప్రే చేసి… సిబ్బందిలో మనోధైర్యం నింపారు. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని మంత్రి వెల్లంపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read | పోలీసుల కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే, ఎందుకో తెలుసా