టీడీపీకి రాజీనామా చేసి..వైసీపీలో చేరిన మైనర్టీ నేత : కేఈ సోదరులదీ అదే దారా?!

ఏపీలో వలసల రాజకీయం కొనసాగుతోంది. అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలోకి తక్కెట్లో కప్పల్లా గెంతుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలోకి ప్రతిపక్ష టీడీపీలోంచి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లాలో టీడీపీకి మరోషాక్ తగిలింది. మైనార్టీ సీనియర్ నేత సుభాన్ భాషా టీడీపీకి రాజీనామా చేశారు.
ఇంతకాలం టీడీపీలో ఉన్న నేతలకు ఇప్పుడు సడెన్ గా చంద్రబాబు తీరు నచ్చటంలేదట. అందుకే రాజీనామా చేస్తున్నారట. ప్రస్తుతం సుబాన్ బాషా కూడా అదే కారణంతో రాజీనామా చేశానని అంటున్నారు. చంద్రబాబు, లోకేశ్ ల తీరు నచ్చటం లేదని సుబాన్ బాషా ఆరోపిస్తున్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేశానని తెలిపారు. అలా టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీ పార్టీ ఎంతో నచ్చేసిందట. అందుకే వెంటనే డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఆధ్వర్యంలో వైసీపీలో చేరిపోయారు.
తాజాగా ..మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..సోదరుడు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కేటాయింపులో కేఈ ప్రభాకర్ అసంతృప్తితో పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది.
కేఈ ప్రభాకర్ మొదటిసారి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004లో కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు. 2009లో ప్రభాకర్ సోదరుడు కృష్ణమూర్తి డోన్‌లో పోటీ చేయడంతో.. ఆయన పత్తికొండ నుంచి పోటీచేసి గెలిచారు. 2014లో మరో సోదరుడు ప్రతాప్ డోన్ నుంచి పోటీచేసి ఓడిపోవడంతో.. 2019లో ప్రభాకర్‌ను డోన్ నుంచి పోటీచేసి చేయించగా ఓడిపోయారు. తర్వాత కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేయడంతో.. తర్వాత ఎమ్మెల్సీగా ప్రభాకర్‌కు అవకాశం కల్పించారు. కాగా మాజీ డిప్యూటీ సీఎం కేఈ కూడా పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది.