తీవ్ర తుఫాన్‌గా ఫోని : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 03:57 AM IST
తీవ్ర తుఫాన్‌గా ఫోని : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Updated On : April 30, 2019 / 3:57 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఫోని తీవ్ర తుఫాన్ గా మారింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. రాబోయే 6 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశముందని..24 గంటల్లో పెను తుఫాన్ గా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాయువ్య దిశగా పయనిస్తున్న ఫోని మే 1 తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని తెలిపారు. మే 1 సాయంత్రానికి ఈశాన్య దిశగా పయనించి.. అనంతరం దిశ మార్చుకుని ఒడిశా దిశగా కదిలి అక్కడే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్రకు పెను తుఫాను ముప్పు తప్పినట్టేనని భావిస్తున్నారు.

మే 3, 4 తేదీల్లో ఉత్తరాంధ్ర సమీపంలో తుఫాన్ పయనించే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మే 3న భారీ వర్షాలు.. మే 4న అతి భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫోని ప్రభావంతో మంగళవారం (ఏప్రిల్ 30,2019) రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఫోని ప్రస్తుతం చెన్నైకి 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నటు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. పెను తుఫాన్ ప్రయాణించే ప్రాంతంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఫోని ప్రభావంతో ఏప్రిల్ 30న రాయలసీమ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ., ఉత్తరాంధ్ర జిల్లాల్లో 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వివరించారు. మే 2న ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో గంటకు 40-60 కి.మీ వేగంతో, 3వ తేదీకల్లా గంటకు 60-85 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మే 1-3 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మే 2-4 తేదీల్లో వాయువ్య బంగాళాఖాతంలో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలియజేశారు. మే 1 వరకు దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, మే 2-4 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో సముద్రం కల్లోలంగా ఉంటుందన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.