వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యే విషయంలో టీడీపీ వ్యూహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ చంద్రబాబుపై సంచలన కామెంట్లు చేశారు. రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు. ఐదేళ్లలో రాజధాని అమరావతిని చంద్రబాబు అభివృద్ధి చేయలేదని అన్నారు.
రాజధాని అమరావతిని ఎంత అభివృద్ధి చేశామన్న విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ హితవు పలికారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై ప్రజల్లో అనుకూలత ఉందని, ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం ద్వంద్వ వైఖరితో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించకపోయినా కూడా చంద్రబాబుపై విమర్శలు అయితే గట్టిగానే చేశారు మద్దాలి గిరి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది. గతంలో వల్లభనేని వంశీ జగన్ మోహన్ రెడ్డిని కలవగానే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వల్లభనేని వంశీ పార్టీ నుంచి సస్పెండ్ అయి స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ అవకాశాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం కల్పించారు. దీంతో ఎమ్మెల్యే వంశీ పదవికి ఢోకా లేకుండా పోయింది.
ఇప్పుడు అలా కాకుండా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా మద్దాలి గిరి స్థానంలో కోవెలమూడి రవీంద్రను నియమించింది. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే సీఎం జగన్‌ను కలిసినట్లు టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ చెబుతున్నారు.