రెంట్ అడిగినందుకు ఇంటికి నిప్పు

స్వంత ఇళ్లు లేని వారు అద్దె ఇళ్లపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. కొంత కాలం తరువాత ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నాడు. దీంతో కోపం వచ్చిన సదరు వ్యక్తి నన్నే ఇల్లు ఖాళీ చేయమంటావా అనుకున్నాడో ఏమో ఏకంగా ఆ ఇంటికి నిప్పు పెట్టేశాడు.దీంతో ఆ ఇల్లు చాలా వరకూ దగ్థమైపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గణేష్ నగర్లో జరిగింది.
జమ్మికుంటలో కనకమ్మ అనే మహిళ వాసాల విజయ్ అనే వ్యక్తికి రూ.1000కి అద్దెకిచ్చింది. తరువాత నెల నెలా చెల్లించాల్సిన అద్దె గురించి విజయ్ ను అడిగింది కనకమ్మ. కానీ అద్దె ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు విజయ్, దీంతో కనకమ్మ విజయ్ ను అద్దె డబ్బుల కోసం నిలదీసింది. అయిన ఇవ్వకపోవటంతో విజయ్ ను ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. ఆగ్రహం వచ్చిన విజయ్ నన్నే ఇల్లు ఖాళీ చేయమంటావా అంటూ ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో ఇల్లంతా మంటలు వ్యాపించటంతో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయటంతో ఘటనాస్థానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
కానీ అప్పటికే ఇంటిలో చాలా భాగం అగ్నికి ఆహుతి అయిపోయింది. దీంతో కనకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.