నెత్తిన పిడుగు – కాపాడిన హెల్మెట్

మెదక్: హెల్మెట్ పెట్టుకోండి.. ప్రాణాల్ని కాపాడుకోండి.. పోలీస్ శాఖ చెవిన ఇల్లు కట్టుకుని మరీ చెబుతోంది. హెల్మెట్ వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బతికి బయటపడ్డవారు ఎంతోమంది. హెల్మెట్.. రోడ్డు ప్రమాదం నుంచే కాదు.. పిడుగు నుంచి కాపాడుతుందని ప్రూవ్ అయ్యింది. హెల్మెట్ ధరించడంతో ఓ వ్యక్తి… నెత్తిన పిడుగు పడినా బతికిపోయాడు. ఈ ఘటన మెదక్ శివారులో బుధవారం(మార్చి 20,2019) జరిగింది.
వెల్దుర్తి మండల రామాయిపల్లికి చెందిన నర్సింహులు శివ్వాయిపల్లి నుంచి బైక్ పై మెదక్ వస్తున్నాడు. ఈ సమయంలో వర్షం కురిసింది. దీంతో బంగ్లా చెరువు కట్టపై ఉన్న మర్రిచెట్టు కింద ఆగాడు. వర్షంతోపాటు నర్సింహులుపై పిడుగు పడింది. అది కూడా సరిగ్గా నర్సింహులు తలపైనే పడింది. ఆ పిడుగుపాటుకు నర్సింహులు గాయపడ్డాడు.. కానీ ప్రాణాలు కోల్పోలేదు. హెల్మెట్ కారణంగా ప్రాణాలు కాపాడుకున్నాడు. గాయాలపాలైన నర్సింహులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలిసిన వాళ్లు అంతా ఆశ్చర్యపోతున్నారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడింది అని గ్రేట్ గా చెప్పుకుంటున్నారు. హెల్మెట్ విలువ తెలుసుకున్నామని, ఇక ముందు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.