నిత్య కల్యాణమూర్తి : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

నిత్య కల్యాణమూర్తి అయిన వేంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 29న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
మరుసటి రోజు సెప్టెంబర్ 30న సాయంత్రం 5గంటల 23నిమిషాల నుంచి 6గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ దేవదేవునికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహనసేవ అక్టోబరు 4న జరగనుంది. 5న స్వర్ణరథం, 6న సూర్య, చంద్ర ప్రభ వాహన సేవలు, 7న రథోత్సవం, 8న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో సింఘాల్ సమీక్ష నిర్వహించారు. బందోబస్తు కోసం 4200 మంది పోలీసులు, 1200 మంది టిటిడి భద్రతా సిబ్బందితో పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టనున్నారు. మాడ వీదుల్లో 280 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రూ.15.57కోట్లతో మరో వెయ్యికిపైగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా.. వారికి చైల్డ్ ట్యాగ్స్ వేయనున్నారు టీటీడీ అధికారులు.
బ్రహ్మోత్సవాల్లో 12 రకాలు, 40 టన్నుల పుష్పాలతో శ్రీవారిని అలంకరించనున్నారు. బ్రహ్మోత్సవాలు నిర్వహించే 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ పరిధిలోని వ్యక్తులకే పరిమితం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో 24 గంటల పాటు ఘాట్ రోడ్లు తెరిచే ఉంచుతారు. వాహనాలు మరమ్మతులకు గురైతే వెంటనే చేరుకునేందుకు వీలుగా 4 క్రేన్లు, 4 ఆటోక్లినిక్‌లను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులకు గోవిందనామాలు, విష్ణుసహస్రనామాల పుస్తకాలు, ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని ఈవో తెలిపారు.
సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8 వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒక సంవత్సరంలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలు నిలిపివేసింది. అక్టోబర్ 4న గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఆ రోజున ఏడుకొండలకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కూడా 3వేలకు పైగా ట్రిపులను నడపనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ పక్కాగా ప్రణాళికలు రూపొందించింది.