గోవిందా..గోవిందా : తిరుమలలో తెప్పోత్సవ వైభవం

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవోపేతంగా మొదలయ్యాయి. మార్చి 16వ తేదీ శనివారం సాయంత్రం 6 టలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయ నాలుగు మాఢవీధుల గుండా పుష్కరిణి వద్దకు ఊరేగింపు చేరుకుంది. తొలిరోజు శ్రీవారు కోనేరులో తెప్పపై మూడుచుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. మార్చి 17వ తేదీ ఆదివారం రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి అవతారంలో దర్శనమివ్వనున్న శ్రీవారు.
తెప్పోత్సవాల్లో మొదటి రోజు స్వామివారు శ్రీరామచంద్రమూర్తిగా తెప్పపై భక్తులకు దర్శనమివ్వగా.. రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో భక్తులకు దర్శనం కల్పించనున్నారు. మార్చి 18వ తేదీ సోమవారం భూదేవి సమేతంగా మలయప్పస్వామి మూడుమార్లు పుష్కరణిలో చుట్టి భక్తులను అనుగ్రహించనున్నారు. నాలుగో రోజైన మంగళవారం మలయప్పస్వామి వారు ఐదుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ఇక చివరి రోజు ఏడుమార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు స్వామి సేవలో తరించేందుకు అన్ని చర్యలు తీసుకుంది.