తిరుపతి రైల్వేస్టేషన్‌కు మహర్దశ

  • Published By: veegamteam ,Published On : January 19, 2019 / 02:16 PM IST
తిరుపతి రైల్వేస్టేషన్‌కు మహర్దశ

Updated On : January 19, 2019 / 2:16 PM IST

చిత్తూరు : తిరుపతి రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. కోట్లాది రూపాయలతో రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించనున్నారు. అధునాతన వసతులతో స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. దేశంలోనే దీన్ని మోడల్ స్టేషన్‌గా మార్చేందుకు ఇప్పటికే అధికారులు ప్లాన్‌ రెడీ చేశారు. ఇందుకు సంబంధించిన టెండర్లు త్వరలోనే ఖరారు కానున్నాయి. నిత్యం ప్రయాణికులతో కళకళలాడుతూ ఉండే తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది ప్రయాణికులు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు సికింద్రాబాద్ తర్వాత అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఘనత కూడా తిరుపతి స్టేషన్‌దే. అయితే గతంలో ఈ రైల్వే స్టేషను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మారుస్తామని యూపీఏ సర్కారు హామీ ఇచ్చినా నెరవేరలేదు. తాజాగా తిరుపతి స్టేషన్ అభివృద్ధికి రైల్వే శాఖ నడుంబిగించింది.

అనేక సమీక్షల అనంతరం రైల్వే అధికారులు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ఇప్పుడున్న రైల్వే స్టేషన్ భవనం స్థానంలో ఓ అధునాతన ఐదు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో రైల్వే ట్రాక్‌కు,  మొదటి అంతస్తులో పార్కింగ్ వెయిటింగ్ రూములు, రెండవ అంతస్తులో హోటల్స్‌, మూడవ అంతస్తులో కమర్షియల్ షాపులు, నాలుగవ అంతస్తులో థియేటర్స్, రిటైరింగ్ రూములు,  ఐదవ అంతస్తులో విశ్రాంతి గదులు. ఇదీ స్థూలంగా స్టేషన్ ముఖ్య ప్రతిపాదనలు. వీటితోపాటు ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెంచడం, అధునాతన ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న రైల్వే స్టేషన్‌కు ఉత్తర ముఖాన మార్గం ఇరుకుగా ఉండటంతో దక్షిణ భాగాన స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. పడమర వైపు ఉన్న టిటిడి స్థలాన్ని సైతం రైల్వే అధికారులు తీసుకున్నారు.

స్టేషన్‌కు తూర్పున ఉన్న తిరుచానూరు, పడమర ఉన్న వెస్ట్ రైల్వే స్టేషన్ వరకు మొత్తం పది కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని సైతం ఆధునీకరించనున్నారు. ఈ మార్గం జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ, నేషనల్ బిల్డింగ్ కన్స్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ సంస్థతో .. ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ విధానం ద్వారా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు ఖరీదు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా త్వరలోనే టెండర్లు పిలవాలని రైల్వే ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.