మోడీ, రాహుల్ నియోజకవర్గాల్లోనూ వెయ్యి నామినేషన్లు వేయించాలి : పసుపుబోర్డుపై కవిత వ్యాఖ్యలు

మోడీ, రాహుల్ నియోజకవర్గాల్లోనూ 1000 నామినేషన్లు వేయించాలన్నారు నిజామాబాద్ TRS ఎంపీ అభ్యర్థి కవిత. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో వేయి మంది రైతులు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మార్చి 19వ తేదీ మంగళవారం సాయంత్రం గిరిరాజ్ మైదానంలో TRS నిర్వహించిన ఎన్నికల సభలో కవిత దీనిపై క్లారిటీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసేది కవితనా ? లేక బీజేపీనా అంటూ ప్రశ్నించారు. బోర్డు ఏర్పాటుపై బీజేపీ ఏనాడు పట్టించుకోలేదని..తాను మాత్రం ఎంతో కృషి చేయడం జరిగిందని చెప్పారు. రైతన్నలు పండించే పంటలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీతో అనుసంధానం చేసే విధంగా చూస్తానన్నారు.
నిజామాబాద్ జిల్లాల్లో పసుపు పంట సాగవుతుందని అయితే ఈ పంటకు జాతీయస్థాయిలో బోర్డు ఉంటే బాగుంటుందని ఆనాడు తాను చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఎంపీగా గెలిపిస్తే తాను బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ఆనాడు చెప్పినట్లే పని చేసినట్లు తెలిపారు. బోర్డు సాధన కోసం ఎక్కిన కొండ లేదు…మొక్కని బండ లేదన్నారు. ముఖ్యమంత్రులను ఒప్పించి మద్దతు లేఖలను తీసుకుని ప్రధాన మంత్రి మోడీకి ఇచ్చినట్లు, ఐదేళ్లు గడిచినా పసుపు బోర్డును బీజేపీ ఏర్పాటు చేయలేదన్నారు.
అయితే దీనిపై బీజేపీ పలు విమర్శలు గుప్పించడం సబబు కాదని..ప్రజలు గమనించాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో రైతుల ముసుగులో బీజేపీ, కాంగ్రెస్ నేతలు చొచ్చుకొచ్చారన్నారు. జాతీయస్థాయిలో ఎర్రజొన్న, పసుపు రైతుల కష్టాలు తెలియాలంటే..రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ నియోజకవర్గాల్లో 1000 నామినేషన్లు వేయాలని..అప్పుడు ఎలా చర్చకు రాదో వేచి చూద్దామన్నారు కవిత. మరోసారి ఎంపీగా పంపిస్తే పసుపు బోర్డు కోసం కృషి చేస్తానని మరోసారి హామీనిచ్చారు కవిత. TRS అంటే తెలంగాణ రైతుల పార్టీ అని అభివర్ణించారు.