గోల్డ్ రిపోర్ట్ : శ్రీవారి బంగారంపై రచ్చ

తిరుమల వెంకన్న బంగారం తరలింపులో వెలుగు చూసిన లోపాలపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నివేదిక ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో TTD నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు, టీటీడీ అజాగ్రత్తగా వ్యవహరించిందని చెప్పారు. బంగారం తరలింపులో లోపాలున్నాయన్నది నిజమేనని, శ్రీవారికి చెందిన బంగారం భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమన్నారు. బంగారం తరలింపులో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందని చెప్పారు. టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై నివేదికను ముఖ్యమంత్రికి పంపించామని తెలిపారు.
భద్రత బాధ్యత బ్యాంకుదే – డిప్యూటీ సీఎం కేఈ
టీటీడీ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియ ఇవాళ్టిది కాదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద 2016 ఏప్రిల్ 17న….13 వందల 11 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మూడేళ్ల కాల వ్యవధి ముగియడంతో బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని టీటీడీ ఫైనాన్షియల్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. 13 వందల 11 కేజీలతో పాటు వడ్డీ కింద మరో 70 కేజీలు కలిపి…13 వందల 81 కేజీల బంగారాన్ని బ్యాంక్ నుంచి తిరుపతికి తరలించారని తెలిపారు. బంగారం రవాణాలో భద్రత బాధ్యత పూర్తిగా బ్యాంక్‌దేనని స్పష్టం చేశారు.
రక్షణ లేదు – ఎంపీ విజయసాయి
మరోవైపు చంద్రబాబునాయుడు పాలనలో దేవాలయాలకు, దేవాలయ భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ పాలనలో దేవుడికి సంబంధించి ప్రతి ఒక్కటి దోచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన 13 వందల కేజీల బంగారం ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. మొత్తానికి దేవుడి బంగారంపై రచ్చ.. ఈ నివేదికతో ఆగుతుందా.. లేక కొనసాగుతుందా..? ఇంకా ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఆ శ్రీవారికే తెలియాలి.