కరీంనగర్‌లో హైటెన్షన్ : చర్చలు జరిపితేనే..డ్రైవర్ బాబు అంత్యక్రియలు

  • Published By: madhu ,Published On : October 31, 2019 / 02:58 PM IST
కరీంనగర్‌లో హైటెన్షన్ : చర్చలు జరిపితేనే..డ్రైవర్ బాబు అంత్యక్రియలు

Updated On : October 31, 2019 / 2:58 PM IST

కరీంనగర్‌లో హైటెన్షన్‌ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో.. ప్రభుత్వం చర్చలు జరిపేంత వరకు.. డ్రైవర్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదంటున్నారు. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటుకు గురై..కన్నుమూశాడు.  డ్రైవర్ బాబు మృతికి సంతాపంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. 

ఎంపీ బండి సంజయ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ… డ్రైవర్ బాబు మృతదేహం దగ్గరే బైఠాయించారు. వీరికి మద్దతుగా 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం రాత్రికి.. ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్ష నాయకులు కరీంనగర్ చేరుకోనున్నారు. నవంబర్ 01వ తేదీ శుక్రవారం కూడా కరీంనగర్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా బంద్ కొనసాగుతుండగానే.. మరో వైపు మంథని ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. బస్ డిపో ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తోటి కార్మికులు అడ్డుకుని అతడ్ని వారించారు. 

డిపోల వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, వామపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
మరోవైపు హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఆల్‌ పార్టీ నేతలంతా గవర్నర్ తమిళిసైను కలిసారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టులను కేసీఆర్ లెక్కచేయడం లేదని.. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క  జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై గవర్నర్ బాధపడ్డారని .. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 

ఇదిలా ఉంటే..ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్‌కు పర్మిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. మూడు వేల నుంచి నాలుగువేల రూట్లలో ప్రైవేట్‌ బస్‌లకు పర్మిట్లు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వెయ్యి రూట్లలో ప్రైవేటు పర్మిట్ల కోసం నోటిఫికేషన్‌ జారీచేస్తే.. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. 21 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. కేబినెట్‌లో చర్చించి ప్రైవేట్‌ బస్‌లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
Read More : తల్లిని ఎలా చంపానంటే : కీర్తిరెడ్డి కేసులో షాకింగ్ నిజాలు