దుర్గమ్మ గుడిలో కొత్త వివాదం : చీరల విభాగంలో రూ.లక్షల్లో స్కామ్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో మరో కొత్త వివాదం నెలకొంది. దుర్గమ్మ చీరల విభాగంలో లక్షల రూపాయల స్కామ్ బైటపడింది. ఈ విషయంలో ఐదుగురు సభ్యులతో ఉన్నతాధికారులు వేసిన కమిటీ విచారణలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. కమిటీ రిపోర్ట్ మేరకు విచారణ చేపట్టిన అధికారులు చీరల విభాగంలో లక్షల్లో అక్రమాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఇది తెలిసిన అధికారులు అవాక్కయ్యారు. కనక దుర్గమ్మకు భక్తులు ఇచ్చిన పట్టుచీరల స్థానంలో సాధారణ చీరలు ఉంచినట్లుగా గుర్తించారు.
కనకదుర్గమ్మకు ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో చీరలను సమర్పిస్తుంటారు. ఆ చీరలను దేవస్థానం ఉన్నతాధికారులు వేలం వేసి విక్రయిస్తుంటారు. వాటిని భక్తులు కొనుగోలు చేస్తారు. ఈ విక్రయాలలో అక్రమార్కులు తమ ప్రతాపం చూపించారు. సూపరింటెండెంట్ కంట్రోల్ ఉండే పట్టు చీరలు గుమాస్తాల కంట్రోల్ లోకి వెళ్లాయి. సాధారణంగా గుమాస్తాల కంట్రోల్ లో కాటన్ చీరలు మాత్రమే ఉంటాయి. కానీ పట్టు చీరల లెక్కలను కూడా గుమాస్తాలు వారి కంట్రోల్ లోకి తీసుకున్నారు. అక్రమాలు మొదలు పెట్టారు.
అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన 81 పట్టు చీరల స్థానంలో సాధారణ చీరలు పెట్టి…వాటి లేబుళ్లను కూడా మార్చేశారు. రూ.500ల చీరకు రూ.10 వేల రేట్లతో లేబుళ్లు పెట్టి పిన్ చేశారు. వాటికి భారీ డిస్కౌంట్లు పెట్టి కౌంటర్ లో అమ్మానికి పెట్టారు. అమ్మవారికి పెట్టిన చీర కొనుక్కుని కట్టుకున్నా..లేదా ఇంట్లో పెట్టుకున్నా మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు వాటిని కొనుగోలు చేస్తుంటారు. అలా రూ.500ల చీరలను కూడా వేల రూపాయల లేబుళ్లు పెట్టి విక్రయిస్తుంటే వాటినే భక్తులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల జేబులు నిండుతున్నాయి.
అంతేకాదు టైలరింగ్ చార్జీలు, స్టాఫ్ కు ఇచ్చే జీతాల పేరుతో రూ.2 లక్షలు డ్రా చేసారు. అవిమాత్రం ఇవ్వాల్సివారికి ఇవ్వలేదు. దీంతో వారు ఈవోకు కంప్లైంట్ చేయటంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు కమిటీని వేశారు. కమిటీ రిపోర్టులో చీరల విభాగంలో భారీ స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు ఉన్నతాధికారులు.
ఈ విభాగంలో అక్రమాలకు పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ చేసిన రూ.11 లక్షలు స్కామ్ బైట పడటంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ స్కామ్ లో మిగిలిన అధికారుల పాత్ర ఎంత ఉంది అనే విషయంపై కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ స్కామ్ పై ఆలయ సూపరిండెంటెంట్, ఏఈవో నిర్లక్ష్యంపై ఈవో సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమాలకు పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ నుంచి డబ్బుల్ని రికవరీ చేస్తామని తెలిపారు. ఇకపై ఇటువంటి వాదాలు…అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గతంలో కూడా దుర్గమ్మ చీరల విభాగంలో రూ.75 లక్షల స్కామ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి చీరల విభాగంలో అక్రమాలు జరగుతుండటంతో ఈవో అప్రమత్తమయ్యారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాక్షాత్తు అమ్మవారి సన్నిథిలోను..భక్తులు అమ్మవారికి ఇచ్చిన చీరల విషయంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నవారిపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ ఉన్నతాధికారులకు సూచించారు.