మేనమామే కిడ్నాపర్ : రెండు నెలల పాప కిడ్నాప్ కేసు సుఖాంతం

విజయవాడలో జరిగిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసులో ట్విస్టులు బైటపడ్డాయి. పాప మేనమామ అఖిల్ పాపను కిడ్నాప్ చేసినట్లుగా తేలింది. అఖిల్ ను కిడ్నాప్ కు ప్రోత్సహించిన అతడి బాబాయి భగవత్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సెప్టెంబర్ 30 సాయంత్రం మేనమామ అఖిల్ పాపను కిడ్నాప్ చేశాడు. ఓ స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుని పాపను తీసుకెళ్లి ఇంటికి రెండు కిలో మీటర్ల సమీపంలో ఉన్న ముళ్లపొదల్లో వదిలేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
వివరాల్లోకి వెళితే..రెండు నెలల పసిబిడ్డ కనిపించకపోవటంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా..ఆ ప్రాంతంలోని సీసీ టీవీల పుటేజ్ లను పరిశీలించారు. వాటిలో పాప మేనమామ అఖిల్ పాపను అఖిల్ తీసుకెళ్లినట్లుగా అనుమానించారు.
దీంతో అఖిల్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బైటపెట్టాడు. స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుని పాపను తీసుకెళ్లి అక్కడికి రెండు కిలోమీటర్ల సమీపంలో ముళ్ల పొదల్లో వదిలేసానని చెప్పాడు. పోలీసులు వెంటనే పాపను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం చిన్నారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. పసి ఛాయలు కూడా వీడని 16ఏళ్ల వయస్సుకే అఖిల్ కిడ్నాప్ చేయటం పట్ల డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అఖిల్ ను కిడ్నాప్ కు ప్రోత్సహించిన బాబాయ్ భగవత్ రాజును కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
కాగా..పాపను ముళ్లపొదల్లో పడేయటంతో పాపకు శరీరానికి ముళ్లు గుచ్చుకుని గాయాలయ్యాయి. దీంతో పాపకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నామని ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.
తన స్వంత పెదనాన కుమారుడే తన చిన్నారిని కిడ్నాప్ చేశాడని తెలుసుకున్న తల్లి ఎవర్ని నమ్మాలో కూడా అర్థం కావటంలేదుంటూ కన్నీరు పెట్టుకుంది. డబ్బు అవసరం ఉన్నంత మాత్రన చిన్నబిడ్డను కిడ్నాప్ చేసిన తనకు ఇంత వేదన కలిగించటం ఎంత వరకూ సమంజసం అంటూ ఆవేదనగా ప్రశ్నించింది.